తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ (Kodada) లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోదాడ మండలం దొరకుంట శివారులో హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. గాయపడిన వారిని వెంటనే కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
లారీని ఢీకొట్టడంతో బస్సులోకి దూసుకొచ్చిన ఐరన్ షీట్లు
దొరకుంట శివారులో ఐరన్ సామగ్రితో లారీ రహదారిపై నిలిచి ఉంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తున్న బస్సు లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో లారీలోని ఐరన్ షీట్లు బస్సులోకి చొచ్చుకెళ్లినట్లు సమాచారం.
ప్రమాద సమయంలో కొందరు ప్రయాణికులు నిద్రలో ఉండటంతో ఐరన్ షీట్లు వారికి తీవ్ర గాయాలు కలిగించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద తీవ్రతకు ఇదీ ఒక కారణంగా మారినట్లు తెలుస్తోంది.
డ్రైవర్ నిద్రమత్తే కారణమా?
ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నట్లు సమాచారం. బస్సు ఉదయం 9 గంటలకు ఏలూరు చేరుకోవాల్సి ఉండగా.. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది.
ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్ మల్లికార్జున అక్కడి నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మృతుల్లో నలుగురి వివరాలు గుర్తింపు
ప్రమాదంలో మృతి చెందిన వారిలో నలుగురిని అధికారులు గుర్తించారు. మృతులను యాసారపు చిన్ని (32), బొల్లిపొంగు మేరీ జోష్న (29), చెన్నకేశవుల నాగేంద్రబాబు (21), సురవరపు షకీనాగా గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది.
మృతదేహాలను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్యం
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశాలతో సూర్యాపేట జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి
కోదాడ రోడ్డు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
ప్రయాణికుల భద్రతపై రవాణా మంత్రి సూచనలు
ఈ ప్రమాదంపై ఏపీ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి కూడా స్పందించారు. ఆరుగురు మృతి చెందడం బాధాకరమని పేర్కొంటూ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, బస్సుల యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు
తెల్లవారుజామున జరిగిన ఈ ప్రమాదంలో డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కారణమా? లేక రహదారిపై లారీ నిలిపిన తీరులో ఏమైనా లోపాలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.




