Jogi meghana pressmeet: తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబానికి సంబంధించిన వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలు ఆరోపణలు, ప్రత్యారోపణలు తెరపైకి రాగా.. తాజాగా జోగి రమేశ్ కోడలు మేఘన మీడియా సమావేశం నిర్వహించి తన వాదనను వెల్లడించారు. జోగి రమేశ్ తనపై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
అత్తమామలను సొంత తల్లిదండ్రులుగా భావించా..
జోగి రమేశ్, ఆయన భార్యను తాను సొంత అమ్మానాన్నలుగా భావించానని మేఘన తెలిపారు. అయితే తన భర్తకు ఉన్న సమస్యలు తెలిసినప్పటికీ తనకు వివాహం చేశారని ఆరోపించారు. అత్తింట్లో తనకు ఎదురైన పరిస్థితులపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తనకు అత్తగారు ప్రేమగా గోరుముద్దలు తినిపించారని జోగి రమేశ్ చెప్పిన వ్యాఖ్యలు తనను మరింత బాధించాయని మేఘన అన్నారు. నిజంగా తనపై ప్రేమ చూపించి ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కావని వ్యాఖ్యానించారు. భార్యాభర్తల మధ్య సమస్యను పరిష్కరించకుండా వివాదాన్ని మరింత పెంచారని ఆరోపించారు.
అదనపు కట్నం గురించి మాట్లాడారని ఆరోపణ
అదనపు కట్నం తీసుకొస్తేనే తాను సంతోషంగా ఉంటానని తన అత్త చెప్పినట్లు మేఘన ఆరోపించారు. తన పుట్టింటి వారికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదని, వారు పూర్తిగా వ్యాపార కుటుంబానికి చెందినవారని చెప్పారు.
తన పెళ్లికి ముందు అత్తింటివారు తమ మతపరమైన నేపథ్యంపై ఒక విధంగా చెప్పారని, పెళ్లి తర్వాత వాస్తవ పరిస్థితి తెలిసిందని మేఘన పేర్కొన్నారు. మతాన్ని పాటించడం తప్పు కాదని.. అయితే కొన్ని విషయాలను దాచిపెట్టి వివాహం చేయడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు.
ఆధారాలన్నీ పోలీసులకు ఇచ్చా: మేఘన
తన అత్తింట్లో హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసేవారని మేఘన ఆరోపించారు. ఇంట్లో బైబిల్ చదివినా తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదన్నారు. అయితే ఇంట్లో పూజా గది కూడా లేదని ఆమె పేర్కొన్నారు.
తన వద్ద ఉన్న ఆధారాలను ఇప్పటికే పోలీసులకు అందజేశానని మేఘన తెలిపారు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న ప్రతి ఆరోపణకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, సరైన సమయంలో వాటిని మీడియా ముందు ఉంచుతానని చెప్పారు. ప్రస్తుతం బయటకు వచ్చిన వీడియోలు కొన్ని మాత్రమేనని.. తనను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో తెలిపే మరిన్ని ఆధారాలను సమయం వచ్చినప్పుడు బయటపెడతానని అన్నారు.
పలువురు నేతలను కలిశానన్న మేఘన
తనకు న్యాయం చేయాలని కోరుతూ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను కలిసిన మాట వాస్తవమేనని మేఘన చెప్పారు. ఆయన తన మేలు కోరి కొన్ని సూచనలు చేశారని, సమస్యను పరిష్కరిస్తానని చెప్పారని తెలిపారు.
ఫిర్యాదు చేసేందుకు పోలీస్ కమిషనర్ (సీపీ) వద్దకు వెళ్లిన సమయంలో కేసు పెట్టకుండా తమ లాయర్ ద్వారా మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించారని ఆమె ఆరోపించారు. అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద సమస్యను సెటిల్ చేసుకోవాలని సూచించినట్లు చెప్పారు.
తాను న్యాయం చేస్తానని, రాజీ చేసుకోవాలని సజ్జల సూచించినట్లు మేఘన వెల్లడించారు. అయితే కాలయాపన తప్ప సమస్య పరిష్కారం కాలేదని, జోగి రమేశ్ నుంచి తనకు న్యాయం జరగలేదని ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కూడా కలిసేందుకు ప్రయత్నించామని, అయితే ఆ ప్రయత్నం ఫలించలేదని ఆమె తెలిపారు.
పెళ్లైన రెండు నెలలకే విడాకుల కేసు ఎందుకు?
పెళ్లైన రెండు నెలలకే తన భర్త రాజీవ్ తనపై ‘నల్ అండ్ వాయిడ్’ కేసు వేశారని మేఘన తెలిపారు. పెళ్లైన ఇంత తక్కువ సమయంలోనే విడాకుల కోసం ఎందుకు వెళ్లారనే విషయం తనకు ఆలస్యంగా తెలిసిందన్నారు.
రాజీవ్ వేసిన విడాకుల పిటిషన్‌ను కోర్టు కొట్టివేసిందని మేఘన పేర్కొన్నారు. తనను వదిలించుకునేందుకు అనేక కట్టుకథలు చెప్పారని ఆమె ఆరోపించారు.
ఏడాదిన్నరగా క్షోభ అనుభవిస్తున్నాం
తన భర్తకు చికిత్స చేయిస్తామని చెప్పి పుట్టింటికి వెళ్లమన్నారని మేఘన తెలిపారు. చికిత్స పేరుతో తాను అత్తింటికి అప్పుడప్పుడు వెళ్లేదానినని చెప్పారు.
తమ తప్పు లేకుండానే గత ఏడాదిన్నరగా మానసిక క్షోభను అనుభవిస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని మేఘన స్పష్టం చేశారు.
గమనిక: మేఘన ప్రెస్మీట్లో చేసిన ఆరోపణలను ఆమె వాదనగా మాత్రమే పేర్కొంటున్నాం. ఈ ఆరోపణలపై జోగి రమేశ్ కుటుంబం నుంచి వచ్చే స్పందనను కూడా సమానంగా పరిగణించాల్సి ఉంటుంది.




