ఈ మధ్య కాలం లో జనాలు ఆరోగ్యం పట్ల అనేక శ్రద్ధ కనపరుస్తున్నారు. పూర్వం మన పూర్వికులు మనకు చెప్పినా వినకుండా సైన్స్ సైన్స్ అంటూ తిరిగి చివరకు ఇదేదో మనమే కనిపెట్టాం అని ఆ ఆహార నియమాలు అని, ఈ ఆహార నియమాలు అని చెపుతున్నాం. సరే విషయానికి వస్తే చక్కెర వాడకూడదు, వాడితే ప్రమాదం దాని బదులు బెల్లం, లేక పోతే కలకండ పొడి వాడాలని సూచిస్తున్నారు. ఒకప్పుడు బెల్లం తో చేసిన పదార్ధాలు ఎంతో రుచి గా ఆరోగ్యం గా ఉండేవి. బెల్లం తో చేసిన పల్లి ఉండలు, పప్పు ఉండలు ఎంతో రుచి గా ఉంటాయి. ఇప్పుడు ఏకం గా తాటి బెల్లం టీ, తాటి బెల్లం కాఫీ అని ఫ్రాంచేసి లు పెట్టి టీ, కాఫీ లు లాగించేస్తున్నారు. ఒక పక్క టీ, కాఫీ హాని కరం అంటూ నే టీ కొట్లు పెట్టేస్తున్నారు.
ఇక తాటిబెల్లంతో టీ, కాఫీ, స్వీట్లు, రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. ఆరోగ్యానికి మంచిదనడంతో దీనికి డిమాండు పెరుగుతోంది. కొంతమంది తమిళనాడు నుంచి రకరకాల స్వీట్లను తెప్పించుకుంటున్నారు. నాణ్యమైన తాటిబెల్లం ధర సాధారణ బెల్లం కంటే ఎక్కువగానే ఉంటుంది.
తాటి చెట్టు నుంచి సేకరించే ద్రవమే నీరా.. పులియని నీరా నుంచి బెల్లం, పంచదార, పటిక తదితర ఉత్పత్తులు చేస్తారు. 100 లీటర్ల నీరా నుంచి 12 కిలోల బెల్లం వస్తుంది. ఇందులో చక్కెర 90-95శాతం ఉంటుంది. నీరాలో సున్నం కలిపితే బెల్లం నాణ్యత తగ్గుతుంది. తాటిబెల్లంతో ఎన్నోకాజు బర్ఫీ, హల్వా, పాయసం, కేకులు, చాక్లెట్లు, బిస్కట్లు..ఇలా చాలా రకాలుగా తయారు చేస్తారు.
తాటిబెల్లం పేరుతో వివిధ రకాల బెల్లం విక్రయాలు చేస్తుంటారు. అయితే ఇందులో నాణ్యత ముఖ్యం. సున్నం ఎక్కువగా కలిస్తే ఆరోగ్యానికి ఇబ్బందికరం. కొంతమంది పంచదార, ఇతర పొడులతో తయారు చేసిన తాటిబెల్లం విక్రయిస్తుంటారు.
అసలు తాటి బెల్లం లో ఏమి ఉంటాయంటే… ఇందులో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి. 20 గ్రాములు చొప్పున ప్రతిరోజూ తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. ఇనుము, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాల్ని అందిస్తుంది. మధుమేహం ఉన్న వారైతే వైద్యుల్ని సంప్రదించిన తర్వాతే వాడాలి. జీర్ణక్రియ మెరుగుకు, రక్తహీనత నివారణ, శరీరానికి శక్తి, శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం, కాలేయ శుద్ధి, కీళ్ల నొప్పుల నివారణ, రక్తపోటు నియంత్రణ, రోగనిరోధకశక్తి పెరుగుదలకు ఇది ఉపయోగపడుతుంది. త్రిదోష సమతుల్యత, కణజాల శక్తిని పెంచే సాధనంగా ఆయుర్వేదంలో దీన్ని ఉపయోగిస్తారు.
తమిళనాడు రాష్ట్ర వృక్షం తాటిచెట్టు. అక్కడ తాటిచెట్టు నరకడం నిషేధం. ఒక చెట్టుకు బదులుగా పది మొక్కలు నాటి సంరక్షించాలి. దేశవ్యాప్తంగా సుమారు 15 కోట్ల తాటిచెట్లు ఉంటే.. తమిళనాడులోనే సుమారు 5 కోట్లకు పైగా ఉన్నాయి అని ఒక అంచనా. ఇక మన తెలుగు రాష్ట్రాలలో సుమారు 5 కోట్ల వరకు తాటిచెట్లు ఉంటాయని అంచనా. తాటిబెల్లం తయారీకి తమిళనాడు ఎంతో ప్రసిద్ధి.. అక్కడ ఏటా సుమారు 1.6 లక్షల టన్నుల ఉత్పత్తి అవుతోంది. ఇది దేశంలోనే అత్యధికం. తర్వాత స్థానంలో పశ్చిమబెంగాల్ ఉంది.
తాటి ఉత్పత్తుల ద్వారా గిరిజన కుటుంబాల ఆదాయం పెంచేందుకు ఐటీడీఏ చింతూరు, YSR ఉద్యాన విశ్వవిద్యాలయం మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. నీరా సేకరణ, తాటిబెల్లం తయారీ, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, నాణ్యత మెరుగుదల, వ్యాపారాభివృద్ధి, సాంకేతిక మార్గదర్శకత్వం, పరిశోధనా సహకారం అందించనుంది.
తాటిబెల్లం ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యానికి తాటిబెల్లం ఎంతో మంచిది. ఆయుర్వేద మందుల్లో తాటిబెల్లం కలిపేవారు. కొన్నేళ్లుగా దీనికి డిమాండు పెరుగుతోంది. మార్కెట్లో నాణ్యమైన బెల్లం కొరత ఉంది. కుటీర పరిశ్రమల తరహాలో వాణిజ్యంగా ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించాం. గిరిజన ప్రాంతాల్లో తాటిబెల్లం యూనిట్ల ఏర్పాటుకు కార్పొరేట్ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. పమిడిమర్రి ఉద్యాన పరిశోధనా కేంద్రంలో తాటిబెల్లం తయారీపై శిక్షణ ఇస్తున్నాం. ఏపీతోపాటు బిహార్, తమిళనాడు నుంచి కూడా కొందరు వస్తున్నారు.
ఏది ఏమైనా మన వాళ్ళు ఆరోగ్యం పై శ్రద్ధ పెంచుకుని మన పూర్వీకులు చెప్పినవి చేస్తున్నారు..ఇదీ ఒకందుకు మంచిదే…




