9/11 Attacks.. జరిగి పాతికేళ్ళు…. ప్రపంచాన్ని కుదిపేసిన ఆ రోజు ఏం జరిగింది? పూర్తి కథనం
ప్రపంచ చరిత్రలో కొన్ని ఘటనలు ఎప్పటికీ చెరిగిపోవు. అలాంటి విషాదమే 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ఉగ్రదాడులు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రతీకగా నిలిచిన న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌పైకి ప్రయాణికుల విమానాలను ఉగ్రవాదులు ఢీకొట్టడం, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయమైన పెంటగాన్‌పై మరో విమానం దాడి చేయడం ప్రపంచాన్ని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన తర్వాత అమెరికా విదేశాంగ విధానం, అంతర్జాతీయ భద్రతా వ్యవస్థ, విమాన ప్రయాణ నిబంధనలు, ఉగ్రవాదంపై ప్రపంచ దేశాల పోరాటం పూర్తిగా మారిపోయాయి.
అసలు 9/11 అంటే ఏమిటి?
2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని నాలుగు ప్రయాణికుల విమానాలను అల్‌ఖైదాకు చెందిన 19 మంది ఉగ్రవాదులు హైజాక్ చేశారు. వీరి లక్ష్యం అమెరికాలోని అత్యంత ప్రతీకాత్మక, వ్యూహాత్మక ప్రదేశాలపై దాడి చేయడం. నాలుగు విమానాల్లో రెండు న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌ను ఢీకొన్నాయి. మూడో విమానం వర్జీనియాలోని పెంటగాన్‌ను ఢీకొట్టింది. నాలుగో విమానం మాత్రం తన లక్ష్యాన్ని చేరుకోకముందే పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్ సమీపంలో కూలిపోయింది.
ఉదయం 8:46.. మొదటి విమానం ఢీ
స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8:46 గంటలకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 11 న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉత్తర టవర్‌ను ఢీకొట్టింది. అప్పటికి ఇది ప్రమాదమా, ఉగ్రదాడా అనే విషయం స్పష్టంగా తెలియలేదు. కొద్ది నిమిషాలకే మరో విమానం అదే ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ఉదయం: 9:03 గంటలకు రెండో విమానం
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 175 దక్షిణ టవర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటన టెలివిజన్ ప్రత్యక్ష ప్రసారాల్లో కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. అప్పటికి ఇది సాధారణ విమాన ప్రమాదం కాదని స్పష్టమైంది. అమెరికా తీవ్ర ఉగ్రదాడికి గురైందని అధికారులు నిర్ధారించారు.
ఉదయం 9:37 గంటలకు
మూడో హైజాక్ చేసిన విమానం అమెరికా రక్షణ వ్యవస్థకు అత్యంత కీలకమైన పెంటగాన్ వైపు దూసుకెళ్లింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 77 పెంటగాన్‌ను ఢీకొట్టింది. దీంతో భవనం ఒక భాగంలో భారీగా నష్టం జరిగింది. విమానంలోని ప్రయాణికులు, సిబ్బందితో పాటు పెంటగాన్‌లో ఉన్న పలువురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్…
నాలుగో విమానం ఏం జరిగింది?
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 93ను కూడా ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అయితే విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది పరిస్థితిని తెలుసుకుని హైజాకర్లను ఎదుర్కొనే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విమానం పెన్సిల్వేనియాలోని షాంక్స్‌విల్ సమీపంలో కూలిపోయింది. విమానంలోని ఎవరూ ప్రాణాలతో బయటపడలేదు. అయితే ప్రయాణికుల ప్రతిఘటన కారణంగా విమానం ఉగ్రవాదుల లక్ష్యాన్ని చేరుకోలేదని అధికారిక దర్యాప్తులు నిర్ధారించాయి. లేక పోతే విమానం లో ఉన్న వారితో పాటు మరెంతమంది మరణించేవారో?…..
ట్విన్ టవర్స్ ఎందుకు కూలిపోయాయి?
విమానాలు ఢీకొన్న వెంటనే టవర్లు కూలిపోలేదు. ఢీకొన్న ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విమాన ఇంధనం వల్ల మంటలు మరింత తీవ్రంగా మారాయి. కొంతసేపటి తర్వాత దక్షిణ టవర్, ఆ తర్వాత ఉత్తర టవర్ కూలిపోయాయి. ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారమయ్యాయి. వేలాది మంది భవనం నుంచి బయటపడేందుకు ప్రయత్నించారు. అత్యవసర సేవల సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ దాడుల్లో దాదాపు 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానాల్లో ఉన్న ప్రయాణికులు, వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఉన్న ఉద్యోగులు, పెంటగాన్‌లోని సిబ్బంది, అలాగే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, ఇతర అత్యవసర సేవల సిబ్బంది ఇందులో ఉన్నారు. ఈ దాడి అమెరికా చరిత్రలో అత్యంత ఘోరమైన ఉగ్రదాడిగా నిలిచింది. ఇంత జరిగినా అమెరికా పరోక్షం గా పాకిస్తాన్ కు మద్దతు ఇస్తున్నది ఇప్పటికీ…..అది వేరే విషయం అనుకోండి.
అసలు ఈ దాడుల వెనుక ఎవరు ఉన్నారు? పాకిస్తాన్ కు మేము సపోర్ట్ చేయడం లేదు అని ప్రపంచానికి తెలియచెప్పాలనుకున్నారా?
అమెరికా దర్యాప్తుల ప్రకారం ఈ దాడులకు అల్‌ఖైదా బాధ్యత వహించింది. ఆ సంస్థకు నాయకుడిగా ఉన్న ఒసామా బిన్ లాడెన్**పై అమెరికా ప్రధానంగా దృష్టి సారించింది. అల్‌ఖైదా అప్పటికే అమెరికా ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని పలు దాడులకు పాల్పడిన సంస్థగా అమెరికా భద్రతా సంస్థల దృష్టిలో ఉంది. 9/11 తర్వాత అమెరికా ఉగ్రవాదంపై ప్రపంచవ్యాప్త యుద్ధాన్ని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ ప్రభుత్వం అల్‌ఖైదాను లక్ష్యంగా చేసుకోవడంతో పాటు ఆ సంస్థకు ఆశ్రయం ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్న తాలిబన్ పాలనలోని ఆఫ్ఘనిస్థాన్‌పై సైనిక చర్య ప్రారంభించింది. తర్వాత ఉగ్రవాద వ్యతిరేక చర్యలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. అయితే ఏది జరిగినా మన మంచి కే అన్నట్లు 9/11 తర్వాత ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయ భద్రతా నిబంధనలు పూర్తిగా మారాయి. ప్రయాణికుల తనిఖీలు, సామాను స్క్రీనింగ్, కాక్‌పిట్ భద్రత, విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీలు మరింత కఠినతరమయ్యాయి.
ప్రయాణికులు విమానంలోకి తీసుకెళ్లగల వస్తువులపై కూడా అనేక దేశాలు కొత్త నిబంధనలు అమలు చేశాయి.
9/11 తర్వాత ప్రపంచ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. అమెరికా ఉగ్రవాద వ్యతిరేక విధానానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. అనేక దేశాలు ఉగ్రవాద సంస్థలపై సమాచార మార్పిడి, ఆర్థిక లావాదేవీల పర్యవేక్షణ, సరిహద్దు భద్రత వంటి అంశాల్లో సహకారం పెంచాయి. మరోవైపు అమెరికా చేపట్టిన సైనిక చర్యలు, ముఖ్యంగా ఆఫ్ఘనిస్థాన్ మరియు తర్వాత ఇరాక్‌కు సంబంధించిన పరిణామాలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ దాడుల తర్వాత అమెరికాలో దేశీయ భద్రతకు మరింత ప్రాధాన్యం వచ్చింది. విమానాశ్రయ భద్రతను పర్యవేక్షించే వ్యవస్థలో భారీ మార్పులు జరిగాయి. ఉగ్రవాద ముప్పులను గుర్తించడం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించడం, నిఘా వ్యవస్థలను బలోపేతం చేయడం వంటి చర్యలు విస్తరించాయి.
9/11 తర్వాత దాడులపై అనేక కుట్ర సిద్ధాంతాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. ట్విన్ టవర్స్ కూలిపోవడం, పెంటగాన్‌పై దాడి తదితర అంశాలపై వివిధ అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అమెరికా అధికారిక దర్యాప్తులు, కాంగ్రెషనల్ దర్యాప్తులు, ఇంజినీరింగ్ విశ్లేషణలు, ఇతర పరిశోధనలు దాడులకు సంబంధించిన విస్తృత ఆధారాలను పరిశీలించాయి. సోషల్ మీడియాలో లేదా ఇంటర్నెట్లో కనిపించే ప్రతి కుట్ర వాదనను వాస్తవంగా పరిగణించాల్సిన అవసరం లేదు.
9/11 దాడుల తర్వాత ఒసామా బిన్ లాడెన్ అమెరికా ప్రధాన లక్ష్యంగా మారాడు. దాదాపు పదేళ్ల పాటు సాగిన వేట అనంతరం 2011లో పాకిస్థాన్‌లోని అబ్బొట్టాబాద్‌లో అమెరికా ప్రత్యేక దళాల ఆపరేషన్‌లో బిన్ లాడెన్ (Osama bin laden) హతమయ్యాడు.
ట్విన్ టవర్స్ ఉన్న ప్రాంతాన్ని తర్వాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ సైట్ గా పునర్నిర్మించారు. అక్కడ కొత్త వరల్డ్ ట్రేడ్ సెంటర్ సముదాయం నిర్మించబడింది. అదే ప్రాంతంలో 9/11 బాధితుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం, మ్యూజియం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11న బాధితులను స్మరించుకుంటారు. 9/11 కేవలం అమెరికాపై జరిగిన ఉగ్రదాడి మాత్రమే కాదు. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా భద్రత, విదేశాంగ విధానం, యుద్ధాలు, విమాన ప్రయాణం, అంతర్జాతీయ సంబంధాలపై పడింది. ఒకే రోజు జరిగిన నాలుగు హైజాకింగ్‌లు ప్రపంచ భద్రతా వ్యవస్థను కొత్త దిశలోకి మళ్లించాయి. వేలాది కుటుంబాలను విషాదంలోకి నెట్టాయి. అమెరికా సహా అనేక దేశాల విధానాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేశాయి.
అయితే అంతా సెట్ అయింది కాని కాని ప్రకృతి ఊరుకుంటుందా మంటల్లో దగ్ధమైన ట్విన్ టవర్ నుంచి భారీ ఎత్తున పొగ న్యూయార్క్ నగరాన్ని కమ్మేసింది. దీంతో ప్రమాదకర విషవాయువులు వ్యాపించాయి. కానీ, అధికారులు మాత్రం అలాంటిదేమీ లేదంటూ స్థానిక వ్యాపారాలు తెరిచేందుకు వారు అనుమతినిచ్చారు. దీంతో కార్యకలాపాలు ఎప్పటిలాగే కొనసాగాయి. ఫలితంగా అనేక మంది ఊపిరితిత్తులు, బ్లడ్ క్యాన్సర్ బారిన పడినట్లు, గుండె, శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొన్నట్లు గతంలో పలు నివేదికలు పేర్కొన్నాయి. ఇలాంటి అనారోగ్యంతో మరణాలు కూడా సంభవించినట్లు తెలుస్తోంది.
దాడి జరిగిన దాదాపు 10 నెలల తర్వాత 2002 జులైలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ సమీపంలోని శిథిలాల వద్ద కొంతమంది అధ్యయనకారులు ఆ దుమ్ము నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షించగా.. క్యాన్సర్ కారక ఆస్బెస్టాస్ రేణువులు ఉన్నట్లు గుర్తించారు. నాటి వాయు కాలుష్యానికి సంబంధించిన వివరాలన్నీ 1,70,000 పేజీల నివేదికల్లో పొందుపర్చారు. ఆ పత్రాలు న్యూయార్క్ సిటీ ఆఫీసులోని 68 బాక్సుల్లో కొన్ని దశాబ్దాల పాటు భద్రపర్చారు. ఆ పత్రాలను బహిర్గతం చేయాలని కొన్నేళ్లుగా డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై 9/11 హెల్త్‌వాచ్ అనే సంస్థ కోర్టులో దావా వేసింది కూడా..! ఆ దాడి తర్వాత గాలి సురక్షితంగా లేదనే విషయం రుజువైతే బాధిత కుటుంబాలు పరిహారం పొందే అవకాశం ఉంటుందని ఈ సంస్థ వాదిస్తోంది. ఆ భారం అంతా ప్రభుత్వాల మీద పడుతుంది అని అన్ని రాజకీయ పార్టీలు భావించి నట్లున్నాయి. ఎక్కడైనా రాజకీయ నాయకులు ఒక్కటేగా….ఈ క్రమంలోనే సంబంధిత పత్రాలను ఆన్లైన్లో విడుదల చేసేందుకు నగర మేయర్ మమ్దానీ ఇటీవల ఆదేశాలిచ్చారు. ఈ వారంలోనే అవి బహిర్గతం కానున్నాయి. ‘‘ఆ భయంకర ఘటనతో ఎన్నో జీవితాలు తారుమారయ్యాయి.




