TDP Second List 2026:
TDP Second List 2026: ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. శనివారం (అక్టోబర్ 17) మొత్తం 22 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇందులో ఒక మున్సిపల్ కార్పొరేషన్‌కు మేయర్ అభ్యర్థితోపాటు 21 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఛైర్‌పర్సన్ అభ్యర్థులను ఖరారు చేసింది. తొలి జాబితాలో 36 మంది అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, రెండో జాబితాతో కలిపి మొత్తం 58 మందిని ఎంపిక చేసింది. తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసే తొలి జాబితాను నిన్న విడుదల చేసింది. ఆ జాబితా మీకు తెలిసిందే…లేదంటే మా స్టూడియో వన్ న్యూస్ వెబ్సైట్ లో చూడండి.
TDP Second List 2026: మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అబిదా
రెండో జాబితాలో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా షేక్ అబ్దుల్ అబిదా పేరును ప్రకటించింది.
కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ పోటీ చేస్తున్న కీలకమైన కార్పొరేషన్లలో మచిలీపట్నం ఒకటి.
తొలి జాబితాలో ఏడు కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థులను ప్రకటించగా, రెండో జాబితాలో మచిలీపట్నం అభ్యర్థిని ఖరారు చేసింది.
టీడీపీ రెండో జాబితా – 22 మంది అభ్యర్థులు వీరే!
| నం. | కార్పొరేషన్ / మున్సిపాలిటీ | అభ్యర్థి |
|---|---|---|
| 1 | మచిలీపట్నం | షేక్ అబ్దుల్ అబిదా |
| 2 | ఆకివీడు | నిలోఫర్ షేక్ |
| 3 | బేతంచెర్ల | ఐ. లోకేష్ గౌడ్ |
| 4 | బుచ్చిరెడ్డిపాలెం | దొడ్ల విజయలక్ష్మి |
| 5 | చీరాల | యెరిచర్ల హనీ స్పందన |
| 6 | డోన్ | కోట్ల సుజాతమ్మ |
| 7 | గుత్తి | గోవిందరాజులు తమిళ్ సెల్వి |
| 8 | గుంతకల్లు | యశోద |
| 9 | జంగారెడ్డిగూడెం | రొంగల అనూష |
| 10 | కదిరి | షేక్ సమీరా |
| 11 | కళ్యాణదుర్గం | బుట్న లక్ష్మి |
| 12 | కొండపల్లి | కన్నెకంటి అమూల్య |
| 13 | కొవ్వూరు | జొన్నలగడ్డ రాధారాణి |
| 14 | నాయుడుపేట | షకీరా |
| 15 | నందిగామ | శాకమూరి వంశీధర్ |
| 16 | నందికొట్కూరు | ఈ.ఎం. సబురున్నిసా |
| 17 | నర్సీపట్నం | చింతకాయల పద్మావతి |
| 18 | ప్రొద్దుటూరు | నంద్యాల రాఘవరెడ్డి |
| 19 | వెంకటగిరి | దొంతు శారద |
| 20 | ఉయ్యూరు | చేదుర్తిపాటి ప్రవీణ్ కుమార్ |
| 21 | ఏలేశ్వరం | యార్లగడ్డ అక్షిత |
| 22 | ఎమ్మిగనూరు | మాచాని సునీత |
22 మందిలో 18 మంది మహిళలు!
టీడీపీ రెండో జాబితాలో మహిళలకు అధిక ప్రాతినిధ్యం కల్పించింది. మొత్తం 22 మంది అభ్యర్థుల్లో 18 మంది మహిళలు ఉన్నారు. అంటే దాదాపు 82 శాతం స్థానాల్లో మహిళా అభ్యర్థులను నిలబెడుతోంది. మొదటి జాబితాలో 36 మందిలో 19 మంది మహిళలకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. రెండు జాబితాలను కలిపి చూస్తే మొత్తం 58 మందిలో 37 మంది మహిళలు ఉన్నారు. అంటే మొత్తం అభ్యర్థుల్లో మహిళల వాటా సుమారు 64 శాతం.
బీసీ, ఎస్సీ, మైనార్టీలకు ఎన్ని స్థానాలు?
రెండో జాబితాలో సామాజిక వర్గాలవారీగా కూడా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు పార్టీ విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 22 మందిలో 16 మంది బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు చెందినవారు. వీరి వాటా దాదాపు 73 శాతం.
బీసీలకు ఆరు, ఎస్సీలకు ఐదు, మైనార్టీలకు ఐదు స్థానాలు కేటాయించారు. ముఖ్యంగా మచిలీపట్నం, ఆకివీడు, కదిరి, నాయుడుపేట, నందికొట్కూరు స్థానాల్లో ముస్లిం అభ్యర్థులకు అవకాశం ఇచ్చారు.
నర్సీపట్నంలో చింతకాయల పద్మావతికి అవకాశం
రెండో జాబితాలో మరో ముఖ్యమైన పేరు చింతకాయల పద్మావతి. నర్సీపట్నం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా ఆమెను ప్రకటించారు. ఆమె ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి కావడం విశేషం. అలాగే డోన్‌లో కోట్ల సుజాతమ్మ, చీరాలలో హనీ స్పందన, ప్రొద్దుటూరులో నంద్యాల రాఘవరెడ్డి వంటి అభ్యర్థులకు అవకాశం కల్పించారు.
యువతకు కూడా ప్రాధాన్యం
రెండో జాబితాలో యువ అభ్యర్థులకు కూడా ప్రాతినిధ్యం లభించింది. మొత్తం 22 మందిలో ఆరుగురు 30 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసున్నవారు.
అభ్యర్థుల సగటు వయసు 46 సంవత్సరాలు. దాదాపు సగం మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నట్లు వెల్లడైంది.
దీంతో మహిళలతోపాటు యువత, విద్యావంతులకు అవకాశం కల్పించడంపై కూడా టీడీపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
రెండు జాబితాలు కలిపి 58 మంది!
టీడీపీ అక్టోబర్ 16న విడుదల చేసిన తొలి జాబితాలో ఏడు కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థులు, 29 మున్సిపాలిటీలు–నగర పంచాయతీల ఛైర్‌పర్సన్ అభ్యర్థులు ఉన్నారు. తాజాగా మరో 22 మంది పేర్లను ప్రకటించడంతో మొత్తం 58 మందికి అవకాశం కల్పించినట్లయింది. రెండు జాబితాలను కలిపి పరిశీలిస్తే 37 మంది మహిళలు, 22 మంది బీసీలు, ఎనిమిది మంది ఎస్సీలు, ఏడుగురు మైనార్టీలు, ఒక ఎస్టీ అభ్యర్థి ఉన్నారు.
మొత్తం 58 మందిలో 34 మంది గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగినవారు.
గుంటూరు, ఒంగోలు అభ్యర్థులపై ఆసక్తి
టీడీపీ రెండు విడతలుగా అభ్యర్థులను ప్రకటించినప్పటికీ గుంటూరు, ఒంగోలు కార్పొరేషన్ల మేయర్ అభ్యర్థుల పేర్లు ఈ రెండో జాబితాలో లేవు. ఈ స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో స్థానిక రాజకీయాల్లో ఎన్నికల సందడి పెరుగుతోంది.
మొత్తంగా టీడీపీ రెండో జాబితాలో 22 మందిని ప్రకటించగా, వీరిలో 18 మంది మహిళలు ఉండటం ప్రధాన అంశంగా నిలిచింది. రెండు జాబితాలతో కలిపి 58 మంది అభ్యర్థుల ఎంపిక పూర్తయింది.




