Dasara Mamool: దసరా మామూళ్ల వెనుక అసలు కథ
ఒకప్పుడు పల్లెటూళ్లలో దసరా పండుగ అంటే దేవాలయాలు, ఆయుధపూజ, జమ్మి పూజలతోపాటు మరో ఆసక్తికరమైన సంప్రదాయం ఉండేది. అదే అయ్యవార్లతో కలిసి విద్యార్థులు ఇంటింటికీ తిరగడం. అప్పట్లో చాలా గ్రామాల్లో ఉపాధ్యాయులను అయ్యవార్లు అని పిలిచేవారు. వారికి జీతాలు తక్కువగా ఉండేవి. పండుగ సమయంలో విద్యార్థులను వెంటబెట్టుకుని గ్రామంలోని ఇళ్లకు వెళ్లేవారు.
దసరా వచ్చేసింది కదండి.…
ఇదే ఆ దసరా పాట*
ఏదయా మీదయ మామీద లేదు!
ఇంతసేపుంచుట ఇది మీకు తగదు!
దసరాకు వస్తిమని విసవిసల బడక!
చేతిలో లేదనక ఇవ్వలేమనక !!తగదు!
ఇప్పుడు లేదనక అప్పివ్వరనక!
రేపురా మాపురా మళ్ళి రమ్మనక!!
శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా!
జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!“`
పావలా బేడైతె పట్టేది లేదు
అర్థరూపాయైతె అంటేది లేదు
ముప్పావలైతేను ముట్టేది లేదు
రూపాయి ఐతేను చెల్లుబడి కాదు!
హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము!
జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు!
మా పప్పు బెల్లాలు మాకు దయచేసి
శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా!
జయీభవ విజయీభవా. దిగ్విజయీభవా!!
దసరా పండుగను గిలకల పండగంటారు చక్కగా కొత్త దుస్తులు ధరించి వెదురుతో చేసిన విల్లంబులు,ఎక్కుబెట్టిన విల్లు చివరి భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో తయారుచేసి దానిలో “బుక్కా” రంగు పొడీ కొందరైతై పువ్వులూ వేసి ఒండొరులు చల్లుకొంటు, ఆడుకొంటూ, పాడుకొంటూ నడిచే దసరా గీతమిది.
పంతుళ్ళు వెనుక నడుస్తుంటే పిల్లలు వరుసల్లో పాడుతూ ప్రతి వాకిటా ఆగి దసరా మామూళ్ళు స్వీకరించే ఆత్మీయమైన ఆచార మిది.
ఒక వ్యక్తి అభివృద్ధి గాని కుటుంబ, సమాజ, ప్రాంత అభివృద్ధి గాని జ్ఞానము తోటే సాధ్యమని, చదువుతోటే వికాసమని భావించిన ఆ గ్రామములోని పెద్దలు గ్రామం లోని బడి బలంగా ఉండడానికి తమ సహాయాన్ని అందించేవారు.
ప్రభుత్వ బడులు లేని ఎన్నో గ్రామాల్లో తమ స్ధలాలను బడి పెట్ట డానికి నిస్వార్ధంగా దానం ఇచ్చేవారు. వెలుగుతున్న దీపం మరియొక దీపాన్ని వెలిగిస్తుందని నిజాయతీగా నమ్మిన జ్ఞాన మూర్తులు బతకడానికి కాకుండా, బ్రతికించడానికి ఉపాధ్యాయులుగా మారి ఆ గ్రామంలోని పిల్లలను వెలుగు దివ్వెలుగా మార్చేవారు.
దసరా పండుగ సందర్భంగా ఆ సంవత్సర కాలంలో తాము విద్యార్ధులకు నేర్పిన పద్యాలు, శ్లోకాలు, గణిత సమస్యలు, పొడుపు కధలు మొదలైనవి గ్రామంలోని పెద్దల అందరి ఎదుట దసరా సెలవులలో కుమార జ్ఞాన ప్రదర్శన కావించేవారు.
పిల్లల వయస్సు, తరగతిని బట్టి వివిధ కళలను పిల్లకు నేర్పి తమను పోషిస్తున్న పెద్దలతో చెప్పి మెప్పించి పెద్దలు ఆనందంగా ఇచ్చే కానుకలను పొందేవారు.
ఇదే కదా నిజమైన పరీక్ష ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు!
ఎంత గొప్ప ఆంతర్యమో ఆనాటి దసరా పాటల్లో…!
దేవతా వేషధారులై ఆ చిన్నారులు ఘనమైన పద్యాలు చదువుతూ ఆశ్శీస్సులు అందిస్తే ముగ్దులైన ఆ ఊరి పెద్దలు ఆ బడి ఇంకా ఇంకా ఎదగాలని తమ ధనాన్ని దసరా కానుకగా అందించేవారు.
ఆనాటి పిల్లలు అర్జునునిలా జీవన కుఱుక్షేత్రంలో విజయులే.
అలాంటి ఉపాధ్యాయులు ద్రోణాచార్యులు.
Dasara Mamool మామూలు అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది?
ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఉంది. ‘మామూలు’ అనే పదానికి సాధారణంగా జరిగేది, ఆచారం, అలవాటు, స్థిరపడిన సంప్రదాయం అనే అర్థాలున్నాయి. తెలుగు నిఘంటువులు దీనిని హిందుస్థానీ భాష ద్వారా వచ్చిన పదంగా పేర్కొంటాయి. దీని మూలం అరబిక్ భాషలోని మఅమూల్ అనే పదానికి సంబంధించింది. పాత నిఘంటువుల్లో ఈ పదానికి ఆచారంగా ఇచ్చే భత్యం లేదా కానుక అనే అర్థం కూడా కనిపిస్తుంది. అందుకే దసరా మామూలు అంటే దసరా సందర్భంగా ఆనవాయితీగా ఇచ్చే కానుక అనే అర్థం ఏర్పడింది.
1961 ప్రభుత్వ రికార్డుల్లోనూ దసరా మామూళ్ల ప్రస్తావన!
దసరా మామూళ్ల చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన ఆధారం 1961 జనాభా లెక్కల సందర్భంగా సేకరించిన ఆంధ్రప్రదేశ్ జాతరలు, పండుగల వివరాల్లో కనిపిస్తుంది. ఆ రికార్డులో గ్రామీణ ఉపాధ్యాయులు దసరా సమయంలో విద్యార్థులను వెంటబెట్టుకుని గ్రామాల్లో తిరిగేవారని పేర్కొన్నారు. పిల్లలకు పాటలు నేర్పించి, ఇంటింటా పాడించి, ఉపాధ్యాయులు కొంత డబ్బు స్వీకరించేవారు. విద్యార్థులకు కూడా చిన్న కానుకలు ఇచ్చేవారు.
అంటే ఈ సంప్రదాయం కనీసం ఆరు దశాబ్దాల కిందట కూడా ఆచరణలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. అయితే దాని ప్రారంభ తేదీని ఈ ఆధారంతో నిర్ధారించలేం.
గురువుల నుంచి ఇతర వృత్తులవారికి ఎలా విస్తరించింది?
దసరా సందర్భంగా గురువులకు కానుకలిచ్చే సంప్రదాయంతోపాటు, ఏడాదంతా తమకు సేవలందించిన వారిని గౌరవించే పద్ధతి కూడా ఉండేది. ఇంట్లో పనిచేసేవారు, పాలవారు, ఇతర సేవలందించే వారికి కుటుంబాలు తమ ఆర్థిక స్థోమతను బట్టి డబ్బులు, కొత్త బట్టలు లేదా కానుకలు ఇచ్చేవారు. కాలక్రమంలో ఈ పండుగ కానుకను వివిధ వృత్తులవారు ఆశించడం కూడా సాధారణమైంది. దీన్ని నేటి పండుగ బోనస్‌కు ఒక సామాజిక పూర్వరూపంగా చూడవచ్చు. అయితే చట్టబద్ధంగా చెల్లించాల్సిన ఉద్యోగ బోనస్‌కు, స్వచ్ఛందంగా ఇచ్చే దసరా మామూలుకు తేడా ఉంది.
దసరా మామూళ్లకు పురాణాల్లో ఏదైనా కథ ఉందా?
దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం, శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించడం వంటి పురాణ కథలు విజయదశమి ప్రాధాన్యాన్ని వివరిస్తాయి. దసరా మామూళ్లు ప్రధానంగా సామాజిక, వృత్తిపరమైన కానుకల సంప్రదాయం. దానికి ఒక నిర్దిష్ట పురాణకథను జోడించడం చారిత్రకంగా సరైంది కాదు.
చివరకు అసలు కథ ఏమిటి?
కానీ పాత గ్రామీణ విద్యావ్యవస్థలో గురువులకు ఇచ్చే కానుకలు, సంవత్సరమంతా సేవ చేసినవారిని గౌరవించే ఆచారాలు ఈ సంప్రదాయ చరిత్రలో ముఖ్యమైన భాగాలు.
ఒకప్పుడు పిల్లల నోటి నుంచి వినిపించిన అయ్యవారికి చాలు ఐదు వరహాలు అనే పద్యం, నేడు మనం వినే దసరా మామూలు ఇవ్వండి అనే మాటకు ఉన్న సాంస్కృతిక నేపథ్యాన్ని గుర్తుచేస్తుంది.
also read: అరటి చెట్టుకు గెల ఏ దిశలో వస్తే అదృష్టం? అశుభ దిశలో వస్తే దోష నివారణ ఎలా?
Table of Contents
https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B0%B0%E0%B0%BE





1 comment