Aaruguru Pativratalu: 22 ఏళ్ల తర్వాత మళ్లీ ‘ఆరుగురు పతివ్రతలు’.. 4Kలో థియేటర్లకు ఈవీవీ బోల్డ్ మూవీ
ఓ రెండు దశాబ్దాల క్రితం ఆరుగురు పతివ్రతలు Aaruguru Pativratalu అనే సినిమా విడుదల అయింది. ఇప్పుడు 40 వయసు పై పడిన వాళ్ళు అంతా ఆ సినిమా తెగ చూసేవాళ్ళు. అది ధియేట్రికల్ గా విజయం సాధించక పోయినా టెలివిజన్ లో మంచి TRP వచ్చేది. ఎన్ని సార్లు రిపీట్ వేసినా రేటంగ్ తగ్గేది కాదు. అంత బాగుంటుంది సినిమా. అలాంటి సినిమా మళ్ళీ రీ రిలీజ్ కు సిద్ధం అయింది. ఇప్పుడు సినిమాల్లో, ఓటీటీ సిరీస్‌లలో వివాహ బంధాలు, లైంగిక సమస్యలు, వివాహేతర సంబంధాలు వంటి అంశాలపై బహిరంగంగానే కథలు వస్తున్నాయి. కానీ రెండు దశాబ్దాల కిందట పరిస్థితి పూర్తిగా భిన్నం. అలాంటి సమయంలోనే దాంపత్య జీవితంలోని కొన్ని సున్నితమైన అంశాలను నేరుగా తెరపైకి తీసుకొచ్చిన సినిమా ‘ఆరుగురు పతివ్రతలు’.
ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో 2004లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘ఆరుగురు పతివ్రతలు’ను 4K వెర్షన్లో అక్టోబర్ 29, 2026న థియేటర్లలో రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
Aaruguru Pativratalu అప్పట్లోనే బోల్డ్ కాన్సెప్ట్
కుటుంబ కథలు, కామెడీ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈవీవీ సత్యనారాయణ.. ‘ఆరుగురు పతివ్రతలు’లో మాత్రం భిన్నమైన అంశాలను ఎంచుకున్నారు. భార్యాభర్తల మధ్య అనుబంధం, అనుమానాలు, వివాహేతర సంబంధాలు, లైంగిక సమస్యలు, బలవంతపు వివాహాలు, దాంపత్యంలో ఆధిపత్య ధోరణులు, ప్రేమ, ఆకర్షణ, క్షణికావేశాలు వంటి విషయాలను ఆరుగురు మహిళల జీవితాల ద్వారా చూపించారు. అప్పటి సామాజిక పరిస్థితుల్లో ఇలాంటి విషయాలను సినిమాలో బహిరంగంగా చర్చించడం అరుదు. అందుకే విడుదలైన సమయంలోనే ఈ సినిమా విస్తృత చర్చకు దారితీసింది. కాలక్రమంలో సినిమాలోని కొన్ని సన్నివేశాలు, డైలాగులు సోషల్ మీడియాలో మీమ్స్‌గా మారడంతో కొత్త తరం ప్రేక్షకులకూ ఈ సినిమా పరిచయమైంది.
Aaruguru Pativratalu కథ ఏంటంటే?

పదో తరగతిలో కలిసి చదువుకున్న ఆరుగురు అమ్మాయిలు చాలా సంవత్సరాల తర్వాత తిరిగి కలుస్తారు. చాలాకాలం తర్వాత ఎదురుపడిన స్నేహితులు తమ జీవితాల్లో జరిగిన సంఘటనలను ఒకరికొకరు చెప్పుకోవడం ప్రారంభిస్తారు. పెళ్లి తర్వాత వారి జీవితాలు ఎలా మారాయి? భర్తలతో సంబంధాలు ఎలా ఉన్నాయి? వివాహ బంధంలో వారికి ఎదురైన సమస్యలు ఏమిటి? అనే విషయాలు ఒక్కొక్కరి కథ ద్వారా బయటపడతాయి.
ఒక్కో మహిళ వైవాహిక జీవితంలో ఒక్కో రకమైన సమస్యను ఎదుర్కొంటుంది. అనుమానం, అపార్థాలు, అసంతృప్తి, బలవంతపు పరిస్థితులు, భావోద్వేగ సంఘర్షణలు వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపించాయనే అంశం కథలో కీలకంగా ఉంటుంది. చివరకు సమస్యల్లో చిక్కుకున్న తమ స్నేహితురాలిని ఆమె భర్త నుంచి కాపాడేందుకు మిగిలిన స్నేహితులు ప్రయత్నిస్తారు.
ఆరుగురు మహిళల కోణంలో వివాహ బంధం
సాధారణంగా అప్పటి కుటుంబ సినిమాల్లో కథను ప్రధానంగా హీరో లేదా కుటుంబ పెద్దల కోణంలో చూపించే ధోరణి ఎక్కువగా ఉండేది. ‘ఆరుగురు పతివ్రతలు’ మాత్రం ఆరుగురు మహిళల అనుభవాలను కేంద్రంగా చేసుకుంది. వివాహం తర్వాత మహిళ ఎదుర్కొనే మానసిక సంఘర్షణలు, భార్యాభర్తల మధ్య అవగాహన లేకపోతే వచ్చే సమస్యలను కథలో ప్రస్తావించారు. కామెడీకి పేరున్న ఈవీవీ.. ఇందులో హాస్యంతో పాటు తీవ్రమైన కుటుంబ, దాంపత్య అంశాలను కూడా మిళితం చేశారు.
Aaruguru Pativratalu నటీనటులు
ఈ సినిమాలో అమృత, లహరి, చలపతిరావు, ఎల్బీ శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. పెద్ద సంఖ్యలో కొత్త నటీనటులకు కూడా అవకాశం కల్పించడం అప్పట్లో ప్రత్యేకతగా నిలిచింది.
22 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్లలోకి
2004లో విడుదలైన ‘ఆరుగురు పతివ్రతలు’ ఇప్పుడు దాదాపు 22 ఏళ్ల తర్వాత కొత్త సాంకేతిక రూపంలో థియేటర్లకు వస్తోంది. అక్టోబర్ 29న 4K వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారిక రీ-రిలీజ్ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఇప్పటి ప్రేక్షకులు ఈవీవీ అప్పట్లో చూపించిన వివాహ బంధాలు, సామాజిక అంశాలను ఎలా స్వీకరిస్తారన్నదే ఈ రీ-రిలీజ్లో ఆసక్తికరమైన అంశం.
Read Also: Dorothy Movie Review: స్నేహం, ప్రేమ మధ్య కథ.. ‘డోరతీ’ ఎలా ఉందంటే? https://studioonenews.com/entertainment/dorothy-movie-review-telugu/





2 comments