Skip to content
భక్తి

Vinayaka Vratakalpam: వినాయక వ్రత కల్పం

Vinayaka Vratakalpam: వినాయక చవితి సందర్భంగా గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించేందుకు అనుసరించే సంప్రదాయ పద్ధతుల్లో వినాయక వ్రత కల్పం ముఖ్యమైనది. ఇందులో పూజకు ముందు చేయాల్సిన ఆచమనం, భూతోచ్చాటన, ప్రాణాయామం, సంకల్పం, గణపతి ధ్యానం నుంచి షోడశోపచార పూజ, అంగపూజ, 21 రకాల పత్రాలతో పూజ, అష్టోత్తర శతనామావళి, నైవేద్యం, దూర్వాయుగ్మ పూజ, మంత్రపుష్పం, ప్రదక్షిణ, ప్రార్థన, వ్రతకథ, శమంతకోపాఖ్యానం, ఉద్వాసన వరకు వివిధ దశలు ఉంటాయి.

కుటుంబ సంప్రదాయం, ప్రాంతీయ ఆచారం, పురోహితుల సూచనల ప్రకారం పూజా విధానంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక వ్రతమాచరించవలెను. ప్రతివారు ఉదయమునే లేచి, గృహమును ఆవుపేడతో అలికి ముగ్గులు వేసి, మామిడి తోరణములు మున్నగువానితో అలంకరించవలెను. మండపమును పాలవల్లి మున్నగు వానితో బాగుగా అలంకరించి అందు వినాయక ప్రతిమలనుంచవలెను.

పూజకు కావలిసిన సామాగ్రినంతను సిద్ధము చేసికొనవలెను. ఒక పళ్ళెములో పళ్ళు, పూలు, అక్షతలు, అగరువత్తులు, కర్పూరము ఉంచుకోవలెను. వినాయకునకు కుడుములు, అరటిపళ్ళు, కొబ్బరికాయలు ప్రీతికరమైనవి. వినాయకునకు సమర్పించు అరటిపళ్ళు కుడుములు మొదలుగున్నవి ౨౧ 21 సంఖ్యగలవిగా సమర్పించుట శ్రేష్ఠము. లేనిచో యథాశక్తి సమర్పించవచ్చును.

మూడు చిన్న గిన్నెలను గాని గ్లాసులను గాని తీసుకొని మొదటిదానిలో పాద్యజలము, రెండవదానిలో ఆచమన జలము, మూడవదానిలో అర్ఘ్యజలమునుంచవలెను. అర్ఘ్యమిచ్చునప్పుడు ఏదైనా పండును తీసుకొని నీటితో కలిపి గిన్నెలో వదలవలెను. మధుపర్కము సమర్పించునపుడు తేనె, పాలు, నెయ్యి కలిపి వినాయకునకు చూపవలెను.

పంచామృత స్నానము చేయించునపుడు, తేనె, నెయ్యి, పటికబెల్లము, పెరుగు, పాలు కలిపి అయ్యవారి విగ్రహమునకు అభిషేకము చేయవలెను. శక్తియున్నవారు పాలు, పెరుగు, పండ్లరసము, గంధములు కూడా అభిషేకము చేయవచ్చును. ప్రతి అభిషేకము తరువాత శుద్ధోదక స్నానము చేయించవలెను. ప్రతి శ్లోకమును చదివి శ్లోకము దిగువ యిచ్చినట్లు ఉపచారములు చేయవలెను.

ఏకవింశతి పత్రములు –

వివిధ ఓషధులను గుర్తించుటకు భాద్రపదమాసము అనువైన కాలము. ఇరవై ఒక్క రకముల పత్రిని సేకరించుట అనగా ఇరవైఒక్క రకముల వనౌషధులతో పరిచితి ఏర్పరుచుకొనుటయే. ఓషధీ పరిజ్ఞానముకూడ అవసరమైన విద్యయే. సేకరించుట దేవపూజకు కాబట్టి శ్రద్ధతో జరుగును.

  1. సూచీ – అనగా కుశమ్, కుశదర్భ, బర్హి, సూచ్యగ్ర మున్నగునవి దీని పర్యాయ పదములు, శుభాశుభ కర్మలలో దీనిని హెచ్చుగా వాడెదరు.
  2. బృహతీ – నేలములక, పెద్దములక, వాకుడు మున్నగునవి యిందులో భేదములు.
  3. బిల్వ – మారేడు, శివునకు ప్రియమైనది. గాలిని, నీటిని శుభ్రపరచడంలో సాటిలేనిది.
  4. దూర్వా – అనగా గరిక.
  5. దుత్తూర – ఉమ్మెత్త, విషాన్ని హరించడంలో పెట్టింది పేరు.
  6. బదరీ – రేగు.
  7. అపామార్గ – ఉత్తరేణి.
  8. తులసి – శివకేశవులకిద్దరకు ప్రీతికరమైనది.
  9. చూతపత్రం – మామిడి ఆకు.
  10. కరవీర – గన్నేరు, వాడగన్నేరు.
  11. విష్ణుక్రాంత – నీలవర్ణపు చిన్న చిన్న పూలు పూయును.
  12. దాడిమీ – దానిమ్మ
  13. దేవదారు – ఆకులు, చిన్నవిగా, గుండ్రంగా, సువాసన కలిగి ఉంటాయి.
  14. మరువక – మరువము, చక్కనివాసన గల పత్రములు కలది
  15. సింధువార – వావిలి.
  16. జాజిపత్ర – జాజిపత్రి, జాపత్రి ఒక చెట్టువే. జాజిపత్రి ఆకు, జాపత్రి కాయ మీదితొడుగు. పాఠభేదంతో మాలతీలతకు అర్థం చెప్పుకోవాలని కొందరు అంటున్నారు.
  17. గండవీ – తెల్లగరికె.
  18. శమీ – జమ్మి
  19. అశ్వత్థ – రావి.
  20. అర్జున – మద్ది.
  21. ఆర్కపత్రం – జిల్లేడు.

ఇక పూజ ప్రారంభం….
ఔపోశన చేసే విధానం
(ఉద్ధరిణి తో చేతిని కడుక్కోవ్వలి) హస్తౌ ప్రక్షాళ్యా…
(మన బ్రొటన వేలు ఉంగరం వేలు గణుపు దగ్గర గా వచ్చేట్లు పెట్టి చూపుడు వేలును ఆ బ్రొటన వేలు మీద ఉంచాలి. మనకు అది చూడటానికి గో కర్ణము అంటే ఆవు యొక్క చెవి భాగం ఎలా ఉంటుందో అలా ఉంచాలి. ఇప్పుడు ఉద్ధరణి తో నీరు తీసుకుని చెప్పినటువంటి ముద్ర లో ఈ క్రింది మంత్రం ప్రకారం చేయాలి)

ఓం కేశవాయ స్వాహాః, (నీరు ఒక మారు త్రాగాలి)
ఓం నారాయణాయ స్వాహాః, (నీరు రెండవ మారు త్రాగాలి)
ఓం మాధవాయ స్వాహాః (నీరు మూడవ మారు త్రాగాలి)

దీని వలన గొంతు తడి అయ్యి మంత్రం స్పష్టం గా శబ్ద ధర్మం ప్రకారం వస్తుంది.
అని మూడుసార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. అనంతరం ఈ కింది శ్లోకాలను ఉచ్చరించాలి.

గోవిందాయ నమః – చేతులు కడుక్కోవాలి
విష్ణవే నమః – అనుకుంటూ నీళ్ళు తాకి, మధ్య వ్రేలు, బొటన వేళ్ళతో కళ్ళు తుడుచుకోవాలి
మధుసూదనాయ నమః పై పెదవి ని కుడి నుంచి ఎడమ వైపు కి నిమురుకోవాలి
త్రివిక్రమాయ నమః క్రింది పెదవి ని కుడి నుంచి ఎడమ వైపు కి నిమురుకోవాలి
వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్ళు చల్లుకోవాలి.
హృషీకేశాయ నమః, ఎడమ చేతిలో కొంచెం నీరు తీసుకుని నీళ్ళు చల్లలి.
పద్మనాభాయ నమః మన పాదాలపై ఒక్కో చుక్క నీరు చల్లుకోవాలి
దామోదరాయ నమః శిరస్సుమీద నీరు చల్లుకోవాలి
సంకర్షణాయ నమః చేతి వేళ్ళు గిన్నెలా ఉంచి గడ్డము తుడుచుకోవాలి.
వాసుదేవాయ నమః వేళ్ళతో ముక్కు వదులుగా పట్టుకోవాలి ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః నేత్రాలు తాకవలెను
పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః రెండు చెవులూ తాకవలెను
నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, మధ్య వేలితో బొడ్డును స్పృశించుకోవలెను
ఉపేంద్రాయ నమః వేళ్ళతో శిరస్సును తాకవలెను
హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః, కుడి మూపురమును ఎడమ చేతితోను, ఎడమ మూపురమును కుడి చేతితోను తాకవలెను (మెడ కింది భాగం మరియు వీపు పైభాగం కలిసే చోట)

వినాయక వ్రత కల్పం: శాస్త్రోక్తంగా పూజ ఎలా చేయాలి? పూర్తి వ్రత విధానం ఇదే

కుడి చేతితో అక్షతలు తీసుకుని దేవునిపై చల్లుతూ:

ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యోం నమః, ఓం ఉమామహేశ్వరాభ్యోం నమః, ఓం వాణీ హిరణ్యగర్భాభ్యోం నమః, ఓం శచీపురందరాభ్యోం నమః, ఓం అరుంధతీ వశిష్ఠాభ్యోం నమః, ఓం శ్రీ సీతారామాభ్యోం నమః, నమస్సర్వేభ్యో మహాజనేభ్యః అయ: ముహూర్తః సుముహూర్తోస్తు.
అని చెప్పాలి.

భూతోచ్చాటన

అక్షతలను వాసాన చూసి తలపై నుంచి వెనుకకు వేస్తూ:

ఉత్తిష్ఠంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే.

అనే మంత్రాన్ని చదవాలి.

ప్రాణాయామం
మధ్యవేలుతో ఏదమ నాసికా రంధ్రము ను మూసి చదవాలి (ఓం + గం శబ్దం రావాలి) అలాగే మధ్యలో కుడి నాసికా రంధ్రాన్ని మూసి చదవాలి) ఈ ప్రక్రియ కొంత కష్టం గంద్రగోళం గా ఉంటుంది కాబట్టి పురోహితులు ముక్కు పట్టుకోమని చెపుతారు.
ఓం భూః
ఓం భువః
ఓం సువః
ఓం మహః
ఓం జనః
ఓం తపః
ఓం సత్యం
ఓం తత్సవితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్.

తదుపరి:

ఓమాపో జ్యోతీరసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్.

అని ప్రాణాయామం చేయాలి. కళ్ళు మూసుకుని కుడి నాసికా రంధ్రాన్ని మూసి గాలి ని గుండెల నిండా పీలుస్తూ భృకుటిన అంటే రెండు కనుబొమ్మల మధ్యా భగవంతుడిని కళ్ళు మూసుకుని చూస్తూ ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి కుడి వైపు నాసికా రంధ్రం నుంచి గాలి వొదలాలి. ఇలా ముమ్మారు చేస్తే మనసు ఎంతో ప్రశాంతం గా ఉంటుంది. ఇక పూజ మీద దృష్టి సారించవచ్చు.

శుద్ధి మంత్రం

ఉద్ధరణితో నీరు తీసుకుని నాలుగు దిక్కులా చల్లుతూ:

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోఽపి వా యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః.

అని చదవాలి.

వినాయక వ్రత సంకల్పం

సంకల్ప సమయంలో ముందుగా కాలం, ప్రదేశం, గోత్రం, పేరు తదితర వివరాలను చెప్పాలి.

మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే, శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే, శ్వేతవరాహకల్పే, వైవస్వతమన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణదిగ్భాగే, శ్రీశైల ఈశాన్య ప్రదేశే, గంగా గోదావరి మధ్య… నదీ సమీపే… (అద్దెకు ఉన్నవారు వసతి గృహే అని, సొంత ఇంటివారు స్వగృహే) నివాసిత గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ… నామ సంవత్సరే, … అయనే, … ఋతౌ, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, శుభనక్షత్రే, శుభయోగే, శుభకరణే, ఏవంగుణ విశేషేణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ … గోత్ర … నామధేయ … ధర్మపత్నీ సమేతస్య, సకుటుంబస్య, (మన సంతానం మన దగ్గర లేక పోతే ఉంగరపు వేలును బొడ్డు దగ్గర ఉంచుకుని వారి క్షేమము తలంచాలి ఇది కొన్ని సాంప్రదాయాలలో ఉన్నది) క్షేమ,స్థైర్య, విజయ, అభయ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, త్రపౌత్రాభివృద్ధ్యర్థం, సకలకార్యేషు సర్వదా దిగ్విజయసిద్ధ్యర్థం, సర్వాపదాం నివారణార్థం, సర్వరోగ ప్రశమనార్థం సకల దురిత నివారణార్థం, సర్వాభీష్ట సిద్ధ్యర్థం, శ్రీ వరసిద్ధి వినాయక దేవతాముద్దిశ్య శ్రీ వరసిద్ధి వినాయక దేవతాపూజాం కరిష్యే. అదౌ నిర్విఘ్న పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే.
సంకల్పం పూర్తయ్యాక కుడిచేతి ఉంగరం వేలితో నీటిని ముట్టుకోవాలి.

సంకల్పం పూర్తయ్యాక కుడిచేతి ఉంగరం వేలితో నీటిని ముట్టుకోవాలి.

వినాయక ధ్యానం

పూజ ప్రారంభానికి ముందు గణపతిని ధ్యానించాలి.

భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణమ్ విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహం భజే.

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకమ్.

ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకమ్.

షోడశోపచార పూజ

గణపతికి షోడశోపచార పూజను నిర్వహించాలి. మన ఇంటికి సాక్షాత్తు ఆ భగవంతుడే వస్తే ఎలా పూజిస్తామో అలా జాగ్రత్తగా ధ్యాన, ఆవాహనం చేయాలి

ధ్యానం

ధ్యాయేత్ గజాననం దేవం తప్తకాంచనసన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం.

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి.

ఆవాహనం

అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ ఆవాహయామి.

ఆసనం

రత్నాలతో అలంకరించిన సింహాసనాన్ని సమర్పిస్తూ:

మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం ఆసనం సమర్పయామి.

అర్ఘ్యం ఆచమనం చేయని గిన్నెలు 3 ఉన్నాయి కదా అందులో రెండవది, నీటిని చూపించి ఇందాక సిద్ధం చేసుకున్న చిన్న పాత్రలో వేయాలి.

గౌరీపుత్ర నమస్తేస్తు శంకరప్రియనందన గృహాణార్ఘ్యం మయాదత్తం
గంధపుష్పాక్షతైర్యుతం అర్ఘ్యం సమర్పయామి.

పాద్యం

గజవక్త్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యా పాద్యం మయాదత్తం గృహాణ ద్విరదానన పాద్యం సమర్పయామి. ఒక రెండు నీటి బొట్లను పాదాల వద్ద సమర్పించాలి.

ఆచమనీయం

అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ఆచమనీయం సమర్పయామి. నీటిని చూపించి వదలాలి

Horoscope Today September 14, 2026: వినాయక చవితి వేళ ఈ రాశులకు అదృష్టం.. ఎవరు జాగ్రత్త?

మధుపర్కం
(తేనె (మధు) పెరుగు (దధి)
కొన్ని సంప్రదాయాల్లో నెయ్యి, పాలు, చక్కెర వంటి పదార్థాలు కలుపుతారు. ప్రాంతం, కుటుంబ ఆచారం, పూజా విధానం బట్టి పదార్థాల్లో తేడా ఉంటుంది.)

దధిక్షీర సమాయుక్తం ఘృతమధ్వాజ్యేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోస్తుతే మధుపర్కం సమర్పయామి.

పంచామృత స్నానం
(పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర) ఈ ఐదింటినీ కలిపి పంచామృతం తయారు చేస్తారు. ఒక పుష్పం తీసుకుని ఈ మిసృఅమాన్ని స్వామి వారిపై చిలకరించాలి. లేదా నీటిని అయినా చిలకరించవచ్చు

స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత పంచామృత స్నానం సమర్పయామి.

శుద్ధోదక స్నానం
మనం మొదట మూడు గిన్నెలు నీరు తీసుకున్నం కదా, ఆచమనానికి, అర్ఘ్యానికి, స్నానానికి ఇప్పుదు ఒక పుష్పం తీసుకుని ఆచమనం చేయని గిన్నెలో నీరు తీసుకుని స్వామి వారి మీద చల్లాలి

గంగాది సర్వతీర్థేభ్యః ఆహృతైరమలైర్జలైః స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే శుద్ధోదక స్నానం సమర్పయామి.

వస్త్రం

రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణ త్వం లంబోదర హరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి.

ఉపవీతం

రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వదేవజ్ఞ భక్తానామిష్టదాయక ఉపవీతం సమర్పయామి.

గంధం

చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం గంధాన్ సమర్పయామి.

అక్షతలు

అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే అక్షతాన్ సమర్పయామి.

పత్రాలు

సుగంధాని సుపుష్పాణి జాజీకుందముఖానిచ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే.

గణపతి అంగపూజ

పుష్పాలతో గణపతి శరీర భాగాలను ఈ క్రింది నామాలతో పూజించాలి:

ఓం గణేశాయ నమః పాదౌ పూజయామి (పాదములు)
ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి (చీలమండలు)
ఓం శూర్పకర్ణాయ నమః జానునీ పూజయామి (మోకాళ్ళు)
ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి (పిక్కలు)
ఓం అఖువాహనాయ నమః ఊరూ పూజయామి (తొడలు)
ఓం హేరంభాయ నమః కటిం పూజయామి (నడుము)
ఓం కుమారసుతవే నమః నాభిం పూజయామి (నాభి)
ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి (ఉదరము / పొట్ట)
ఓం గౌరిసుతాయ నమః స్తనౌ పూజయామి (వక్షస్థలము)
ఓం గణనాయకాయ నమః హృదయం పూజయామి (హృదయము)
ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి (కంఠము)
ఓం స్కందగ్రజాయ నమః స్కందౌ పూజయామి (స్కందములు / భుజాలు) * విఘ్నరాజాయ నమః – సర్వాణ్యంగాని పూజయామి.

వినాయకుడికి 21 రకాల పత్రాలతో పూజ

వినాయక పూజలో ఏకవింశతి పత్రపూజకు ప్రత్యేక స్థానం ఉంది. 21 రకాల పత్రాలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి:

క్రమంగణపతి నామంపత్రం
1సుముఖాయ నమఃమాచీపత్రం
2గణాధిపాయ నమఃబృహతీపత్రం
3ఉమాపుత్రాయ నమఃబిల్వపత్రం
4గజాననాయ నమఃదూర్వాయుగ్మం
5హరసూనవే నమఃదత్తూరపత్రం
6లంబోదరాయ నమఃబదరీపత్రం
7గుహాగ్రజాయ నమఃఅపామార్గపత్రం
8గజకర్ణాయ నమఃతులసీపత్రం
9ఏకదంతాయ నమఃచూతపత్రం
10వికటాయ నమఃకరవీరపత్రం
11భిన్నదంతాయ నమఃవిష్ణుక్రాంతపత్రం
12వటవే నమఃదాడిమీపత్రం
13సర్వేశ్వరాయ నమఃదేవదారుపత్రం
14ఫాలచంద్రాయ నమఃమరువకపత్రం
15హేరంబాయ నమఃసింధువారపత్రం
16శూర్పకర్ణాయ నమఃజాజీపత్రం
17సురాగ్రజాయ నమఃగండకీపత్రం
18ఇభవక్త్రాయ నమఃశమీపత్రం
19వినాయకాయ నమఃఅశ్వత్థపత్రం
20సురసేవితాయ నమఃఅర్జునపత్రం
21కపిలాయ నమఃఅర్కపత్రం

శ్రీ గణేశ్వరాయ నమః – ఏకవింశతి పత్రాణి పూజయామి.

వినాయక అష్టోత్తర శతనామావళి

పత్రపూజ అనంతరం గణపతి 108 నామాలను పఠిస్తూ పుష్పములు, అక్షితలు తో పూజ చేయాలి.

ఓం గజాననాయ నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం విఘ్నారాజాయ నమః
ఓం వినాయకాయ నమః
ఓం ద్త్వెమాతురాయ నమః
ఓం ద్విముఖాయ నమః
ఓం ప్రముఖాయ నమః
ఓం సుముఖాయ నమః
ఓం కృతినే నమః
ఓం సుప్రదీపాయ నమః (10)

ఓం సుఖనిధయే నమః
ఓం సురాధ్యక్షాయ నమః
ఓం సురారిఘ్నాయ నమః
ఓం మహాగణపతయే నమః
ఓం మాన్యాయ నమః
ఓం మహాకాలాయ నమః
ఓం మహాబలాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం లంబజఠరాయ నమః
ఓం హ్రస్వగ్రీవాయ నమః (20)

ఓం మహోదరాయ నమః
ఓం మదోత్కటాయ నమః
ఓం మహావీరాయ నమః
ఓం మంత్రిణే నమః
ఓం మంగళ స్వరాయ నమః
ఓం ప్రమధాయ నమః
ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః
ఓం విఘ్నకర్త్రే నమః
ఓం విఘ్నహంత్రే నమః (30)

ఓం విశ్వనేత్రే నమః
ఓం విరాట్పతయే నమః
ఓం శ్రీపతయే నమః
ఓం వాక్పతయే నమః
ఓం శృంగారిణే నమః
ఓం ఆశ్రిత వత్సలాయ నమః
ఓం శివప్రియాయ నమః
ఓం శీఘ్రకారిణే నమః
ఓం శాశ్వతాయ నమః
ఓం బలాయ నమః (40)

ఓం బలోత్థితాయ నమః
ఓం భవాత్మజాయ నమః
ఓం పురాణ పురుషాయ నమః
ఓం పూష్ణే నమః
ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం అగ్రపూజ్యాయ నమః
ఓం అగ్రగామినే నమః
ఓం మంత్రకృతే నమః
ఓం చామీకర ప్రభాయ నమః (50)

ఓం సర్వాయ నమః
ఓం సర్వోపాస్యాయ నమః
ఓం సర్వ కర్త్రే నమః
ఓం సర్వనేత్రే నమః
ఓం సర్వసిధ్ధి ప్రదాయ నమః
ఓం సర్వ సిద్ధయే నమః
ఓం పంచహస్తాయ నమః
ఓం పార్వతీనందనాయ నమః
ఓం ప్రభవే నమః
ఓం కుమార గురవే నమః (60)

ఓం అక్షోభ్యాయ నమః
ఓం కుంజరాసుర భంజనాయ నమః
ఓం ప్రమోదాయ నమః
ఓం మోదకప్రియాయ నమః
ఓం కాంతిమతే నమః
ఓం ధృతిమతే నమః
ఓం కామినే నమః
ఓం కపిత్థవనప్రియాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం బ్రహ్మరూపిణే నమః (70)

ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
ఓం జిష్ణవే నమః
ఓం విష్ణుప్రియాయ నమః
ఓం భక్త జీవితాయ నమః
ఓం జిత మన్మథాయ నమః
ఓం ఐశ్వర్య కారణాయ నమః
ఓం జ్యాయసే నమః
ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
ఓం గంగా సుతాయ నమః
ఓం గణాధీశాయ నమః (80)

ఓం గంభీర నినదాయ నమః
ఓం వటవే నమః
ఓం అభీష్ట వరదాయినే నమః
ఓం జ్యోతిషే నమః
ఓం భక్త నిధయే నమః
ఓం భావగమ్యాయ నమః
ఓం మంగళ ప్రదాయ నమః
ఓం అవ్వక్తాయ నమః
ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
ఓం సత్యధర్మిణే నమః (90)

ఓం సఖయే నమః
ఓం సరసాంబు నిధయే నమః
ఓం మహేశాయ నమః
ఓం దివ్యాంగాయ నమః
ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
ఓం సమస్తదేవతా మూర్తయే నమః
ఓం సహిష్ణవే నమః
ఓం సతతోత్థితాయ నమః
ఓం విఘాత కారిణే నమః
ఓం విశ్వగ్దృశే నమః (100)

ఓం విశ్వరక్షాకృతే నమః
ఓం కళ్యాణ గురవే నమః
ఓం ఉన్మత్త వేషాయ నమః
ఓం అపరాజితే నమః
ఓం సమస్త జగదాధారాయ నమః
ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః
ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః (108)

అనంతరం:

అగజానన పద్మార్కం గజాననమహర్నిశమ్ అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే.

ధూపం, దీపం, నైవేద్యం

ధూపం

దశాంగం గుగ్గిళో పేతం సుగంధం సుమనోహరం ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ ధూపమాఘ్రాపయామి.

దీపం

సాజ్యం త్రివర్తిసంయుక్తం వహ్నినాద్యోజితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే దీపం దర్శయామి.

నైవేద్యం

మోదకాలు, ఉండ్రాళ్లు తదితర పిండివంటలు, భక్ష్యాలు, లేహ్యాలు, చోష్యాలు, పానీయాలను నైవేద్యంగా సమర్పించవచ్చు.

సుగంధాసుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం చాణ ముద్దేః ప్రకల్పితాన్భక్ష్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయాదత్తం వినాయక నైవేద్యం సమర్పయామి.

సువర్ణపుష్పం

సచ్చిదానంద విఘ్నేశ పుష్కరాణి ధనాని చభూమ్యాం స్థితాని భగవన్ స్వీకురుష్వ వినాయక సువర్ణపుష్పం సమర్పయామి.

తాంబూలం

పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం తాంబూలం సమర్పయామి.

నీరాజనం

ఘృతవర్తి సహస్రైశ్చ శకలైః స్థితం నీరాజనం మయాదత్తం గృహాణ వరదో భవ నీరాజనం సమర్పయామి.

Royal Enfield: నష్టాల నుంచి ప్రపంచ బ్రాండ్‌గా.. ఏపీకి ఎలా వచ్చింది?

దూర్వాయుగ్మ (గరిక) పూజ

వినాయకుడికి దూర్వాయుగ్మం తో పూజ చేయాలి.

గణాధిపాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి.
ఉమాపుత్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి.
అఖువాహనాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి.
వినాయకాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి.
ఈశపుత్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి.
సర్వసిద్ధిప్రదాయకాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి.
ఏకదంతాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి.
ఇభవక్త్రాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి.
మూషికవాహనాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి.
కుమారగురవే నమః – దూర్వాయుగ్మం పూజయామి.
ఏకదంతైకవదన తథా మూషికవాహనాయ నమః – దూర్వాయుగ్మం పూజయామి.

అనంతరం:

కుమారగురవే తుభ్యం అర్పయామి సుమాంజలిం మంత్రపుష్పం సమర్పయామి.

ప్రదక్షిణ, నమస్కారం, ప్రార్థన

ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్ననాశన ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

తదుపరి:

అర్ఘ్యం గృహాణ హేరంబ సర్వభద్రప్రదాయక గంధపుష్పాక్షతైర్యుక్తం పాత్రస్థం పాపనాశన పునరర్ఘ్యం సమర్పయామి.

ఓం బ్రహ్మవినాయకాయ నమః.

నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి వ్రతస్య పరిపూర్తయే.

వినాయక నమస్తుభ్యం సంతతం మోదకప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా.

వినాయక దండకం

వినాయక దండకంలో గణపతిని విద్య, జ్ఞానం, బుద్ధి, ఆరోగ్యం, సద్బుద్ధి, విజ్ఞానం, సత్కీర్తి, సన్మార్గం, దేశభక్తి, విద్యాభివృద్ధిని ప్రసాదించే దేవుడిగా ప్రార్థిస్తారు.

“పార్వతీపుత్రా… మహాకాయ! లంబోదరా! ఏకదంతా! గజాస్యా! సదా విఘ్ననాశా!… శూర్పకర్ణా! నమస్తే నమస్తే నమస్తే నమః”

అంటూ దండకాన్ని పఠిస్తారు.

వినాయక వ్రత కథ

వినాయక వ్రతకథను చదివే వారు ముందుగా చేతిలో కొద్దిగా అక్షతలు వేసుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై ఉంచుకోవాలని ఈ వ్రత పాఠ్యంలో సూచించబడింది.

గజాసురుడి కథ

పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు తీవ్రమైన తపస్సు చేసి పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకున్నాడు. తనను ఎవరూ సంహరించలేని శక్తిని కోరాడు. అంతేకాకుండా శివుడు తన ఉదరంలో నివసించాలని కోరడంతో పరమేశ్వరుడు గజాసురుడి కుక్షిలో బందీ అయ్యాడు. శివుడు తిరిగి రాకపోవడంతో పార్వతీదేవి విచారించింది. తన భర్తను విముక్తి చేయడానికి మార్గం చూపమని శ్రీమహావిష్ణువును కోరింది. విష్ణువు గంగిరెద్దుల వేషంలో నందీశ్వరుడిని వెంట తీసుకుని గజాసురుడి వద్దకు వెళ్లాడు. గంగిరెద్దు ప్రదర్శనతో సంతోషించిన గజాసురుడు ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు విష్ణువు గజాసురుడి ఉదరంలో ఉన్న శివుడిని విముక్తి చేయాలని కోరాడు. తన అంత్యం సమీపించిందని గ్రహించిన గజాసురుడు శివుడిని ప్రార్థించి, తన మరణానంతరం తన శిరస్సు త్రిలోకపూజితం కావాలని, తన చర్మాన్ని శివుడు ధరించాలని కోరాడు. అనంతరం నందీశ్వరుడు అతడి ఉదరాన్ని చీల్చి శివుడిని విముక్తి చేశాడు.

గణేశుడి అవతారం

గజాసురుడి నుంచి శివుడికి విముక్తి కలిగిన తర్వాత పార్వతీదేవి కైలాసంలో శివుడి కోసం ఎదురుచూస్తోంది. స్నానానికి సిద్ధమవుతూ తన దేహానికి నలుగుపిండి అద్దుకుంది. ఆ పిండితో ఒక బాలుడి ప్రతిమను తయారు చేసి, మంత్రసాయంతో ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ బాలుడిని ఇంటి వద్ద కాపలాగా ఉంచి పార్వతీదేవి స్నానానికి వెళ్లింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన శివుడిని బాలుడు లోపలికి అనుమతించలేదు. కోపోద్రిక్తుడైన శివుడు బాలుడి శిరస్సును ఖండించాడు. ఇది చూసిన పార్వతీదేవి తీవ్రంగా బాధపడింది. అనంతరం శివుడు గజముఖుడి శిరస్సును తెప్పించి బాలుడికి అమర్చి తిరిగి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అనే నామం పెట్టాడు.

గణాధిపత్యం ఎలా లభించింది?

విఘ్నాలకు ఒక అధిపతిని నియమించాలని దేవతలు, మునులు, మానవులు శివుడిని కోరారు. గణపతి, కుమారస్వామి ఇద్దరిలో ఎవరికి ఈ ఆధిపత్యం ఇవ్వాలనే విషయంపై శివుడు ఒక పరీక్ష పెట్టాడు.ముల్లోకాలలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా తన వద్దకు చేరుకున్నవారికి గణాధిపత్యం ఇస్తానని చెప్పాడు. కుమారస్వామి నెమలి వాహనంపై వేగంగా బయలుదేరాడు. గణపతికి మాత్రం మూషిక వాహనం కావడంతో వేగంగా ప్రయాణించడం సాధ్యం కాలేదు.

అప్పుడు గణపతి నారాయణ మంత్రాన్ని జపిస్తూ తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. తల్లిదండ్రులే తనకు సమస్త తీర్థాలు, ముల్లోకాలకు ప్రతీక అని భావించిన ఈ విధానంతో గణపతి ముందుగా పరీక్షను పూర్తి చేసినట్లు కథ చెబుతుంది.

కుమారస్వామి గణపతి మహిమను అంగీకరించడంతో గణపతికి విఘ్నాధిపత్యం లభించింది.

చంద్రుడి శాపం – నీలాపనిందలు

గణపతి గణాధిపత్యం పొందిన అనంతరం భాద్రపద శుద్ధ చవితి రోజున సమర్పించిన ఉండ్రాళ్లు, కుడుములు, పిండివంటలు, పండ్లు తిని కైలాసానికి తిరిగి వెళ్తున్నాడు. ఆ సమయంలో శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలను చూసి నవ్వాడు. దీంతో గణపతి ఉదరం పగిలి నైవేద్యంగా తీసుకున్న పదార్థాలు బయటకు వచ్చి గణపతి అచేతనుడయ్యాడని కథ చెబుతుంది. దీనికి ఆగ్రహించిన పార్వతీదేవి చంద్రుడిని శపించింది. చంద్రుణ్ణి చూసినవారు నీలాపనిందలు పొందుతారని శాపం ఇచ్చింది.

ఋషిపత్నులకు నీలాపనిందలు

చంద్రుడికి శాపం వచ్చిన సమయంలో సప్తఋషుల భార్యలు యజ్ఞంలో పాల్గొంటున్నారని కథలో వస్తుంది. చంద్రుడి శాపం ప్రభావంతో వారికి కూడా నీలాపనిందలు కలిగాయని కథనం చెబుతుంది. దేవతలు బ్రహ్మదేవుడితో కలిసి కైలాసానికి వెళ్లి పరిస్థితిని వివరించారు. బ్రహ్మదేవుడు గణపతిని తిరిగి జీవింపజేశాడు. అనంతరం పార్వతీదేవి చంద్రుడికి ఇచ్చిన శాపాన్ని కొంత సవరించింది. భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదనే నియమం ఏర్పడింది.

శమంతకోపాఖ్యానం

ద్వాపరయుగంలో ద్వారకలో శ్రీకృష్ణుడికి నారద మహర్షి వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని సూచించాడు. కానీ ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు పాలను తాగుతున్న సమయంలో ఆ పాలలో చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు. కొంతకాలానికి సత్రాజిత్తు సూర్యుని వరంగా శమంతకమణిని పొందాడు. ఆ మణి ప్రతిరోజూ బంగారాన్ని ఇస్తుందని కథలో చెప్పబడింది. సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు. అడవిలో ఒక సింహం ప్రసేనుడిని చంపి మణిని తీసుకెళ్లింది. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చాడు. ప్రసేనుడి మరణానికి శ్రీకృష్ణుడే కారణమని సత్రాజిత్తు నిందించాడు. తనపై పడిన నిందకు కారణం చవితి రోజున చంద్రుడి ప్రతిబింబాన్ని చూడటమేనని శ్రీకృష్ణుడు భావించాడు. మణిని వెదుకుతూ అడవికి వెళ్లి ప్రసేనుడి ఆనవాళ్లను అనుసరించాడు. చివరకు జాంబవంతుడి గుహకు చేరుకున్నాడు. అక్కడ జాంబవంతుడితో శ్రీకృష్ణుడికి 28 రోజుల పాటు యుద్ధం జరిగింది. తనతో యుద్ధం చేస్తున్నది శ్రీరాముడేనని జాంబవంతుడు గుర్తించాడు. అనంతరం శ్రీకృష్ణుడికి నమస్కరించి శమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవతిని సమర్పించాడు. శ్రీకృష్ణుడు మణిని సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చాడు. నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తన తప్పును అంగీకరించి తన కుమార్తె సత్యభామను శ్రీకృష్ణుడికి వివాహం చేశాడు.

చంద్రదర్శన దోషానికి పరిహారం

శమంతకోపాఖ్యానం ప్రకారం భాద్రపద శుద్ధ చవితి రోజున యథావిధిగా వినాయకుడిని పూజించి, ఈ కథను విని, అక్షతలను శిరస్సుపై ఉంచుకున్నవారికి ఆ రోజు చంద్రదర్శనం జరిగినా నీలాపనిందలు కలగవని శ్రీకృష్ణుడు చెప్పినట్లు వ్రతకథలో ఉంది.

కథ పూర్తయిన తర్వాత అక్షతలను శిరస్సుపై ఉంచుకుని వినాయక వ్రతాన్ని ముగించాలి. అనంతరం వినాయకుడి ఎదుట వీలైనన్ని గుంజీలు తీసుకుని సాష్టాంగ నమస్కారం చేయాలని పాఠ్యంలో సూచించబడింది.

మంగళహారతి, ఉద్వాసన

వ్రతకథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతి ఇవ్వాలి. అనంతరం విగ్రహాన్ని ఉద్వాసన చేయాలి.

ఉద్వాసన మంత్రం

ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హ నాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యాః సంతి దేవాః.

అనంతరం:

శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయకస్వామిన్
యథాస్థానముద్వాసయామి.

అని చెప్పి ఉద్వాసన చేయాలి.

మీరు అందించిన పాఠ్యంలో, వినాయక చవితి రోజే విగ్రహ నిమజ్జనం చేయాలనుకుంటే పూజ పూర్తయిన తర్వాత ఉద్వాసన చేయవచ్చని, ఇతర రోజున నిమజ్జనం చేయాలనుకుంటే నిమజ్జనం చేసే రోజున ఉద్వాసన చెప్పవచ్చని సూచించబడింది.

వినాయక వ్రతం ఎందుకు చేస్తారు?

వినాయక వ్రతం ద్వారా విఘ్నాలు తొలగాలని, కుటుంబంలో క్షేమం, స్థైర్యం, విజయము, ఆయురారోగ్యం, ఐశ్వర్యం కలగాలని భక్తులు ప్రార్థిస్తారు. సంకల్పంలో ధర్మార్థకామమోక్షాలు, పుత్రపౌత్రాభివృద్ధి, సకల కార్యాల్లో విజయసిద్ధిని కోరుతూ పూజ నిర్వహించే విధానం ఉంది.

ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి

  • పూజకు ముందు శుద్ధి, ఆచమనం, సంకల్పం పూర్తి చేయాలి.
  • గణపతికి షోడశోపచార పూజ చేయాలి.
  • 21 రకాల పత్రాలతో పూజ చేయాలి.
  • అష్టోత్తర శతనామావళి పఠించాలి.
  • మోదకాలు, ఉండ్రాళ్లు వంటి నైవేద్యాలు సమర్పించాలి.
  • దూర్వాయుగ్మంతో పూజ చేయాలి.
  • వ్రతకథ, శమంతకోపాఖ్యానం వినాలి లేదా చదవాలి.
  • కథ అనంతరం అక్షతలను శిరస్సుపై ఉంచుకోవాలి.
  • మంగళహారతి అనంతరం సంప్రదాయం ప్రకారం ఉద్వాసన చేయాలి.

శ్రీ వరసిద్ధి వినాయక స్వామికి నమః.

సర్వే జనాః సుఖినో భవంతు. Srinivas Bharadwaj Ravinuthala

Ravinuthala Bhakti

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *