తెలంగాణ నీటి అభ్యంతరాలకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ B అమలు చేయబోతుందా? సహజంగా చంద్ర బాబు అంటే నే మంచి విజనర్, బాబు ప్లాన్ వేస్తే ఇక అంతే…అయితే అవన్ని జిత్తుల మారి ఆలోచనలు అని ప్రతిపక్షం వాళ్ళు అంటూ ఉంటారు. ఏది ఎమైనా బాబు ఎత్తు గడలు రాష్ట్రానికి మంచే జరుగుతుంది. ఇంతకూ బాబు వేసిన మాస్టర్ ప్లాన్ ఏమిటంటే….
రాష్ట్రంలో వ్యవసాయానికి, తాగునీటికి ఎంతో కీలకమైన ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రాయలసీమ రాత మార్చే ఒక బృహత్తర ప్రణాళికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధం చేశారు. అదే ప్లాన్ బి. 82 వేల కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టాల్సిన ఒక భారీ ప్రాజెక్టుకు ఎదురైన అడ్డంకులను అధిగమించి, ఆ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్లాలన్న దానిపై ఈ ప్లాన్ బి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అసలు ఈ ప్లాన్ బి ఏంటి? దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? మనం ఒకసారి గతంలోకి వెళితే.. రాయలసీమలో కరువును శాశ్వతంగా పారద్రోలాలనే ఉద్దేశ్యంతో, ప్రభుత్వం గతంలో ఒక భారీ డిజైన్ రూపొందించింది. అదే పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్ట్. గోదావరి జలాలను నేరుగా రాయలసీమకు తరలించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. కానీ, ఇక్కడే ఒక ప్రధాన సమస్య వచ్చి పడింది. గోదావరిలో మిగులు జలాలు లేవని, అందువల్ల ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని పొరుగు రాష్ట్రం తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎగువ రాష్ట్రాల నుంచి పూర్తి అనుమతులు వస్తేనే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లగలమని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. దీనితో రాయలసీమకు నీళ్లు రావడం ఇక కలేనా అన్న ఆందోళన మొదలైంది.
ఇక్కడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన వ్యూహాన్ని మార్చారు. అడ్డంకులను చూసి ఆగిపోకుండా, ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ ప్రారంభించారు. అలా పుట్టిందే ఈ కొత్త డిజైన్. పోలవరం నుంచి నేరుగా బనకచర్లకు నీటిని తరలించే బదులు, వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమల సాగర్‌ను ఈ కొత్త నెట్‌వర్క్‌కు ఒక కీలకమైన జంక్షన్‌గా మార్చాలని నిర్ణయించారు. ఈ కొత్త మార్గం ప్రకారం, మొదట పోలవరం నీటిని కాలువల ద్వారా నేరుగా ప్రకాశం బ్యారేజీకి తీసుకువస్తారు. అక్కడి నుంచి ఆ నీటిని పల్నాడు జిల్లా బొల్లాపల్లి వద్ద నిర్మించబోయే ఒక భారీ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తారు. బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి నేరుగా ఆ నీటిని నల్లమల సాగర్‌కు తరలిస్తారు.
ఒక్కసారి నీరు నల్లమల సాగర్‌కు చేరుకుంటే చాలు, అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా సోమశిల, కండలేరు ప్రాజెక్టులతో పాటు బనకచర్లకు కూడా చాలా సులభంగా నీటిని పంపిణీ చేయవచ్చు. ఈ ప్లాన్ బి వల్ల రాష్ట్రానికి జరిగే అతిపెద్ద లాభం ఆర్థికపరమైనది. ప్రాజెక్టు వ్యయం అమాంతం తగ్గిపోతుంది. మునుపటి డిజైన్ ప్రకారం 82 వేల కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు, ఇప్పుడు కేవలం 58 వేల కోట్లతోనే పూర్తి కానుంది. అంటే రాష్ట్ర ఖజానాకు దాదాపు 24 వేల కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. ఆర్థిక ప్రయోజనంతో పాటు, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టులో దీనిని అంతర్భాగం చేయనున్నారు. పైగా, ఛత్తీస్‌గఢ్ వాడుకోకుండా వదిలేస్తున్న గోదావరి మిగులు జలాలను వినియోగించుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. దీనివల్ల పొరుగు రాష్ట్రాల అభ్యంతరాలకు శాశ్వతంగా చెక్ పడినట్లే.
ఈ ప్రాజెక్టు గనక పూర్తయితే, రాష్ట్ర రూపురేఖలు మారిపోతాయి. నంద్యాల, కడప, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోని దాదాపు 80 లక్షల మంది ప్రజల తాగునీటి కష్టాలు తీరిపోతాయి. అలాగే రాయలసీమ, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలలో సుమారు 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇది నిజంగా ఏపీ భవిష్యత్తును మార్చే ఒక ప్రాజెక్ట్. మరి ఈ ప్లాన్ బి అమలుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో పంచుకోండి.




