
పట్టభద్రుల సమస్యలపై పోరాటానికి సిద్ధం.. ఎమ్మెల్సీగా పోటీ చేయాలంటూ దుండ్ర కుమారస్వామికి యువత, నిరుద్యోగుల డిమాండ్!
2,500 మంది పట్టభద్రులతో ఆత్మీయ ముఖాముఖి.. ఉద్యోగ, ఉపాధి సమస్యలపై విస్తృత చర్చ | ప్రభుత్వాల హామీలు ఆచరణలోకి రావాలన్న యువత | అవసరమైతే రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సానుకూల స్పందన
రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన సుమారు 2,500 మంది పట్టభద్రులు, నిరుద్యోగ యువతతో నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ రిజిస్ట్రేషన్, జాబ్ మేళా కార్యక్రమంలో జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, ప్రముఖ హైకోర్టు న్యాయవాది, సామాజికవేత్త దుండ్ర కుమారస్వామి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టభద్రులు, నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగ నియామకాల్లో జాప్యం, అర్హతలకు తగిన ఉపాధి అవకాశాలు లేకపోవడం, ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కొరత తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. తల్లిదండ్రులు అప్పులు చేసి ఉన్నత విద్య చదివిస్తున్నప్పటికీ యువతకు తగిన ఉద్యోగాలు లభించకపోవడం ఆందోళనకరమని పలువురు అభిప్రాయపడ్డారు. కంపెనీల భాగస్వామ్యంతో నిర్వహించే జాబ్ మేళా ద్వారా అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగ, ఉపాధి హామీలు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో ఫలితాలు చూపాలని యువత డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో పట్టభద్రులు, నిరుద్యోగ యువత దుండ్ర కుమారస్వామి రాజకీయ ప్రాతినిధ్యం ద్వారా తమ సమస్యలను శాసనమండలిలో వినిపించాలని కోరుతూ, రాబోయే రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ రాజకీయాలకు అతీతంగా పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడే నాయకత్వం అవసరమని పేర్కొన్నారు. యువత డిమాండ్‌పై సానుకూలంగా స్పందించిన కుమారస్వామి, ప్రజా సమస్యలకు శాసనమండలిలో గొంతుకగా నిలవాల్సిన అవసరం ఏర్పడితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అంశాన్ని సానుకూలంగా పరిశీలిస్తానని తెలిపారు. గత 13 ఏళ్లుగా సామాజిక న్యాయం, బీసీల హక్కులు, విద్య, ఉపాధి, నిరుద్యోగ యువత సమస్యలపై కొనసాగిస్తున్న పోరాటాన్ని మరింత విస్తృతం చేస్తానని స్పష్టం చేశారు. యువత నుంచి వచ్చిన ఈ రాజకీయ ప్రాతినిధ్య డిమాండ్, కుమారస్వామి సానుకూల స్పందనతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.




