First Bench Prema Katha

ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యులు వి. విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైంది. శ్రీమతి వేదుల బాలకామేశ్వరి సమర్పణలో మెగా ఫిలిమ్స్, సాయి సంహిత క్రియేషన్స్ బ్యానర్లపై ఈ చిత్రం తెరకెక్కుతోంది.
‘మెర్సీ కిల్లింగ్’ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకటరమణ ఎస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా టైటిల్ పోస్టర్‌ను ఆవిష్కరించిన విజయేంద్ర ప్రసాద్, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఫస్ట్ బెంచ్‌లో మొదలైన ప్రేమకథ
కాలేజ్ జీవితంలో ఫస్ట్ బెంచ్‌లో మొదలైన ఓ ప్రేమ ఇద్దరు యువతీయువకుల జీవితాలను ఎలా మార్చింది? అనే అంశం చుట్టూ ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ సాగనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.
ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులపై ర్యాంకుల ఒత్తిడి, వారి భవిష్యత్తుపై తల్లిదండ్రుల ఆశలు ఒకవైపు ఉంటే.. Gen Z యువతలోని భావోద్వేగాలు, క్షణిక ఆనందాలు, తొలి ప్రేమ మరోవైపు ఉంటాయి. ఈ రెండు ప్రపంచాల మధ్య జరిగే సంఘర్షణను ఎమోషనల్‌గా చూపించనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు.
ఇద్దరు టాప్ ర్యాంకర్స్ మధ్య ప్రేమ

ఇద్దరు టాప్ ర్యాంకర్స్ మధ్య మొదలయ్యే ప్రేమ వారి చదువు, కెరీర్, కుటుంబాలు, భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపింది? ప్రేమలోకి అడుగుపెట్టిన తర్వాత వారి జీవితాల్లో వచ్చిన మార్పులు ఎటువైపు దారితీశాయి? అనే అంశాలతో కథ ఆసక్తికరంగా సాగనుంది.
యువతలో ప్రేమ, చదువు, కెరీర్, కుటుంబ బాధ్యతల మధ్య జరిగే సంఘర్షణను హృదయానికి హత్తుకునేలా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
అదే సమయంలో ప్రతి ఒక్కరికీ వారి కాలేజ్ రోజులు, తొలి ప్రేమ జ్ఞాపకాలను గుర్తు చేసే అంశాలు సినిమాలో ఉంటాయని పేర్కొంది.
‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ నిర్మాతలు, సాంకేతిక బృందం
‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’ చిత్రాన్ని కొల్లబత్తిన జోష్న రాణి, నక్క హరిబాబు, కె. రమేష్ చంద్ర నిర్మిస్తున్నారు. శివకోటి బాబి, పఠాన్ వలీఖాన్, కాకరపల్లి రాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.
యూత్‌ఫుల్ లవ్ స్టోరీతో పాటు కుటుంబ భావోద్వేగాలు, విద్యార్థుల భవిష్యత్తు, తల్లిదండ్రుల ఆశలు వంటి అంశాలను కలిపి రూపొందుతున్న ‘ఫస్ట్ బెంచ్ ప్రేమకథ’కు సంబంధించిన మరిన్ని వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించనుంది.




