Maremma: రవితేజ సోదరుడు రఘు తనయుడు మాధవ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘మారెమ్మ’. మంచాల నాగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో దీపా బాలు హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మీద చాలా అంచనాలు పెట్టుకున్నారు. అయితే మారెమ్మ బలి తీసిందా లేక బలి ఇచ్చిందా అని చూస్తే..
మహిషాపురం అనే గ్రామంలో మారెమ్మ అనే గ్రామదేవత ఉంటుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి అమ్మవారికి దున్నపోతును బలి ఇచ్చి జాతర నిర్వహించడం అక్కడి ఆచారం. చిన్నప్పటి నుంచి కర్ణి పాత్రలో మాధవ్… ‘మారి’ అనే దూడను ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. అదే దూడ పెద్దదై జాతరకు బలి ఇవ్వాల్సిన దున్నపోతుగా మారుతుంది. మరోవైపు కర్ణి, మంజు చిన్నప్పటి నుంచి ప్రేమించుకుంటారు. కానీ మంజుకు పక్క ఊరికి చెందిన ఉత్తమ్‌తో పెళ్లి ఖరారు కావడంతో వారి ప్రేమకథలో సమస్య మొదలవుతుంది. జాతరకు ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉండగా బలి ఇవ్వాల్సిన దున్నపోతు కనిపించకుండా పోతుంది. దీంతో ఊరంతా కలకలం రేగుతుంది. అసలు దున్నపోతు ఎక్కడికి వెళ్లింది? జలంధర్‌కు దానిపై ఉన్న పగ ఏంటి? కర్ణి తన ‘మారి’ని కాపాడగలిగాడా? అనేదే మిగతా కథ.
కథలో మంచి ఎమోషన్‌కు అవకాశం ఉన్నా… హీరో, దున్నపోతు మధ్య బంధం తెరపై బలంగా పండలేదు. దీంతో కీలక సన్నివేశాలు ఆశించిన స్థాయిలో కనెక్ట్ కావు. ఫస్ట్ హాఫ్‌లో గ్రామ నేపథ్యం, ప్రేమకథ, కబడ్డీ సన్నివేశాలు, విలన్ ట్రాక్‌తో కథ నడుస్తుంది. అయితే కధ నెమ్మదిగా సాగిన భావన కలిగిస్తాయి. సెకండ్ హాఫ్‌లో దున్నపోతు కోసం వెతికే సన్నివేశాలే ఎక్కువగా ఉండటంతో సినిమా మరింత ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడా కామెడీ ప్రయత్నించినా పెద్దగా వర్కౌట్కా లేదు. కొన్ని సన్నివేశాలు కథకు అవసరం లేకుండా వచ్చినట్టుగా అనిపిస్తాయి. మాధవ్‌కు ఇది తొలి సినిమా. కొన్ని సీన్లలో పర్వాలేదు అనిపించినా… నటన, ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో ఇంకా చాలా మెరుగవ్వాల్సి ఉంది. హీరోయిన్ దీపా బాలు గ్రామీణ యువతి పాత్రలో ఆకట్టుకుంటుంది. రూపాలక్ష్మి, వికాస్ వశిష్ట, వినోద్ కుమార్ తమ పాత్రల్లో పర్వాలేదనిపించారు. టెక్నికల్‌గా పాటలు సినిమాకు కొంత ప్లస్. సినిమాటోగ్రఫీ కొన్ని చోట్ల బాగున్నా… ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, కలర్ గ్రేడింగ్ ఇంకా మెరుగ్గా ఉండాల్సింది. గ్రామదేవత సంస్కృతిని చూపించేందుకు ప్రయత్నం బాగున్నా… డివోషనల్ ఎమోషన్స్ పండలేదు అనే చెప్పాలి.




