Nana Patekar Death: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. నానా పటేకర్ కన్నుమూత
Nana Patekar death ప్రముఖ బాలీవుడ్, మరాఠీ సినీ నటుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం (అక్టోబర్ 8, 2026) తెల్లవారుజామున గోవాలో ఆయనకు గుండె సంబంధిత సమస్య తలెత్తింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. నానా పటేకర్ మృతిని ఆయన కుమారుడు మల్హార్ పటేకర్ ధ్రువీకరించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.
45 నిమిషాల పాటు సీపీఆర్.. ఫలించని ప్రయత్నాలు
గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో నానా పటేకర్ గురువారం తెల్లవారుజామున అపస్మారక స్థితిలో కనిపించారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్య సహాయం అందించేందుకు ప్రయత్నించారు. వైద్యులు దాదాపు 45 నిమిషాలపాటు సీపీఆర్ చేసినప్పటికీ ఆయనను బతికించలేకపోయారు. ప్రాథమిక సమాచారం ప్రకారం కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మరణించారు. మరణానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు వార్తలు వెల్లడించాయి.
‘కాలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం
హిందీ, మరాఠీ చిత్రాల్లో విలక్షణమైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నానా పటేకర్ తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితులే. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘కాలా’ చిత్రంలో హరిదేవ్ అభ్యంకర్ పాత్రలో ఆయన ప్రదర్శించిన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళంలో తెరకెక్కిన ‘బొమ్మలాట్టమ్’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. అర్జున్, కాజల్ అగర్వాల్ నటించిన ఈ చిత్రం తెలుగులో ‘రాణా’ పేరుతో విడుదలైంది.
1978లో మొదలైన సినీ ప్రస్థానం
1951 జనవరి 1న జన్మించిన నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. 1978లో విడుదలైన ‘గమన్’ చిత్రంతో ఆయన సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత ‘అంకుశ్’, ‘పరిందా’, ‘తిరంగా’, ‘క్రాంతివీర్’, ‘అబ్ తక్ ఛప్పన్’, ‘వెల్‌కమ్’, ‘నటసమ్రాట్’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు.
‘పరిందా’ చిత్రంలో ఆయన నటనకు జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది. ‘క్రాంతివీర్’ వంటి సినిమాలు ఆయనకు మరింత గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2013లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
Nana Patekar death నటుడిగానే కాకుండా సామాజిక సేవలోనూ..
నానా పటేకర్ కేవలం నటనకే పరిమితం కాలేదు. రైతుల సంక్షేమం, కరవు బాధితుల సహాయం వంటి కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. నామ్ ఫౌండేషన్ ద్వారా మహారాష్ట్రలో రైతులకు అండగా నిలిచారు. ఆయన మరణంతో హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమల్లో విషాదం నెలకొంది. పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
Read Also:అమితాబ్ మోకాలి కి గాయం అయినా KBC షూటింగ్ లో పాల్గొన్న Big B https://studioonenews.com/entertainment/amitabh-bachan-injured-kbc-18/




